తెలంగాణ వీణ, సినిమా : వంశీ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తోన్న టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో నటి రేణు దేశాయ్ వెండితెరకు రీ-ఎంట్రీ ఇస్తున్నారు. 1970లలో స్టూవర్టుపురంలో పేరుమోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రేణు దేశాయ్… గుర్రం జాషువా కూతురు, సామాజికవేత్త హేమలత లవణంగా కనిపించనున్నారు. ఈ సినిమా ద్వారా రీఎంట్రీ ఇవ్వడంపై, ఈ సినిమాలో నటించడంపై ఆమె ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.సినిమా కథ, దర్శకుడు, నిర్మాత వల్ల తాను రీఎంట్రీ ఇచ్చినట్లు చెప్పారు. హేమలత లవణం పాత్రలో నటించేందుకు తాను మొదట భయపడ్డానన్నారు. ఈ పాత్రకు తాను వంద శాతం న్యాయం చేయగలనా? అనే అనుమానం వచ్చిందన్నారు. వంశీతో పాటు సినిమా టీమ్ మద్దతుతో ఇది సాధ్యమైందన్నారు. ఏ జన్మలో చేసిన పుణ్యం వల్లో ఈ సినిమాలో తనకు అవకాశం దక్కిందని చెప్పారు. తన పోస్టర్ చూశాక తన తనయుడు అకీరా ఎంతో సంతోషించాడన్నారు. చాలామంది నటీనటులు తమ వయస్సుకు తగినట్లుగా నటించేందుకు ఆసక్తి చూపించడం లేదని అన్నారు. తాను మాత్రం అందుకు ఎంతో గర్విస్తున్నానన్నారు.అకీరా తెరంగేట్రంపై కూడా రేణు దేశాయ్ స్పందించారు. మ్యూజిక్, ఫిల్మ్ ప్రొడక్షన్ కోర్సులతో పాటు స్క్రిప్ట్ రైటింగ్‌పై అకీరా దృష్టి పెట్టాడని, నటన వైపు వెళ్లాలని ప్రస్తుతానికి అనుకోవడం లేదని తెలిపారు. తాను లేదా పవన్ కల్యాణ్ కూడా నటుడిగా మారమని అకీరాను బలవంతం చేయడం లేదన్నారు.