తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : అంతర్జాతీయ బాలికల దినోత్సవం రోజున జన్మించిన అనకాపల్లి మండలం రేబాక గ్రామానికి చెందిన లాస్విక ఆర్య అతి పిన్న వయస్సులోనే అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. 6 నెలల వయస్సులో ‘వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో, 9 నెలల వయస్సులో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ‘మెమొరి ఆఫ్ జీకే అవార్డు’ బంగారు పతకం, ప్రశంసాపత్రాలు సాధించి అందరి మన్ననలు పొందుతోంది. జాతిపిత మహాత్మాగాంధీ, స్వాతంత్య్ర సమరయోధులతో పాటు ఏపీ సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, దేశంలో గల అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఫొటోలను గుర్తిస్తుంది.
1 నుంచి 20 వరకూ స్క్వెర్స్‌ను గుర్తించి ‘ మెమొరీ ఆఫ్ జనరల్ నాలెడ్జ్’ విభాగంలో ‘చాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు సంపాదించింది. అక్టోబర్ మొదటి వారంలో ‘లిటిల్ చాంప్–2023’’ ప్రశంసా పత్రాలు, ట్రోఫీ, బ్యాడ్జ్, మెడల్‌ను అందించారు. ఈ ఏడాది జూలైలో ‘ఇండియన్ స్టార్ బుక్ ఆఫ్ రికార్డు’లో కూడా చిన్నారి స్థానం పొందింది. 9 నెలల వయస్సులో 4 నిమిషాల వ్యవధిలో 24 మానవ శరీర భాగాలు గుర్తించడంతో ‘మాక్సిమమ్ బాడి పార్ట్స్ ఐడెంటిఫైడ్ బై ఏ ఇన్‌ఫ్యాంట్’గా ప్రశంసాపత్రంతో పురస్కారాన్ని పొందింది.