తెలంగాణ వీణ , మహబూబ్‌నగర్: న్యాయవాద వృత్తి నుంచి బీజేపీ పార్టీ మద్దతుతో కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామ సర్పంచ్‌గా రాజకీయ అరంగేట్రం చేశారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1982లో సర్పంచ్ హోదాలో ఆ పారీ్టలో చేరారు. నాటి నుంచి క్రియాశీల రాజకీయాల్లో రాణిస్తూ పలు రాష్ట్ర, ఉన్నతస్థాయి పదవులతో పాటు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఎంపికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1987 నుంచి 89 వరకు రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్‌గా పనిచేశారు. 1994లో వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్టీ చీఫ్ విప్‌గా విధులు నిర్వర్తించారు. 1999లో రెండోసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2002 నుంచి 2008 వరకు రాజ్యసభసభ్యుడిగా కొనసాగారు. 2009లో మూడోసారి పోటీ చేసి మంత్రి చిన్నారెడ్డిపై గెలుపొందారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగోసారి పోటీ చేసిన రావుల ఓటమి పాలయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పొత్తులో ఆయనకు పోటీ చేసే అవకాశం లభించలేదు.
టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి సైకిల్ దిగి కారెక్కేందుకు సిద్ధమవుతున్నారా.. అంటే అవుననే సమాధానం విని్పస్తోంది. ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిణామాలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. బీఆర్‌ఎస్‌లోని టీడీపీ పాతకాపుల రాయబారం. మంత్రులతో మంతనాలు. అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో అభిప్రాయ సేకరణ చేస్తుండడం వంటి అంశాలు ఆయన పార్టీ మారుతున్నారనేందుకు బలం చేకూరుస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన క్రమంలో రావుల అడుగులు వేస్తున్న తీరు.. వనపర్తితో పాటు ఉమ్మడి పాలమూరులో చోటుచేసుకునే పరిణామాలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
రావుల చంద్రశేఖర్‌రెడ్డి రాకను వనపర్తికి చెందిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కూడా స్వాగతించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్సీగా రావులకు అవకాశం ఇచ్చేందుకు మంత్రులు హామీ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే చంద్రశేఖర్‌రెడ్డి మహబూబ్‌నగర్ పార్లమెంట్‌పై ఆసక్తి చూపినట్లు వినికిడి. రానున్న ఎన్నికల్లో ఎంపీగా ఇక్కడి నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు తన మనసులోని మాటను వారికి చెప్పినట్లు ఆయన ముఖ్య అనుచరులు గుసగుసలాడుకుంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో వారం రోజుల్లో సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కుండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. రావుల బీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయమైతే వనపర్తిలో సింగిరెడ్డి గెలుపు మరింత సునాయాసమవుతుందని, దేవరకద్రలో సైతం ప్రభావం ఉంటుందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది