తెలంగాణ వీణ : హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌లో నిరుద్యోగి ప్రవళిక ఆత్మహత్య ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్‌లో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. విద్యార్థి ఆత్మహత్య బాధాకరం, విచారకరమన్నారు. ప్రవళికది ఆత్మహత్య కాదని… అది ముమ్మాటికి హత్య అని అన్నారు. యువత కలలు, వారి ఆశలు, ఆకాంక్షలపై జరిగిన హత్య అని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ యువత నిరుద్యోగంతో విలవిలలాడుతోందన్నారు. గడిచిన పదేండ్లలో బీఆర్‌ఎస్ చేతకాని తనంతో రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల క్యాలెండర్‌ను విడుదల చేస్తుందని తెలిపారు. ఒక నెలలో యూపీఎస్సీ (UPSC) తరహాలో టీఎస్‌పీఎస్సీని (TSPSC)పునర్వవ్యవస్థీకరణ చేస్తామని హామీ ఇచ్చారు. ఏడాదిలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.