తెలంగాణ వీణ , హైదరాబాద్ : పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతూ ఆత్మహత్యకు పాల్పడిన మర్రి ప్రవల్లిక (23) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమ వ్యవహారమే ఆమె ఆత్మహత్యకు కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రియుడు తనని కాదని మరొకరితో వివాహానికి సిద్ధం కావడంతో మనస్తాపం చెంది ఆమె సూసైడ్ చేసుకుందని సెంట్రల్ జోన్ డీసీపీ ఎం. వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు శనివారం డీసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన ప్రవల్లిక అశోక్‌నగర్‌లోని ఓ వసతి గృహంలో ఉంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతోంది.
‘‘ఆత్మహత్యపై శుక్రవారం రాత్రి సమాచారం రావడంతో అక్కడికి వెళ్లాం. ఆమె గదిలో సూసైడ్ లెటర్ దొరికింది. ఆమె సెల్‌ఫోన్ కాల్ రికార్డ్‌లు, వాట్సాప్ చాటింగ్‌లతో పాటు ఆమె స్నేహితులను విచారించాం. ప్రవల్లిక మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి గ్రామానికి చెందిన శివరామ్ రాథోడ్‌తో ప్రేమ వ్యవహారం నడిపినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించాం. ప్రియుడితో ఫొటోలు, సీసీటీవీ ఫుటేజ్‌లు కూడా ఉన్నాయి. తనను మోసం చేసి శివరామ్ మరో యువతిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇరువురి మధ్య జరిగిన చాటింగ్‌లను గుర్తించాం.
శివరామ్, ప్రవల్లిక ఇద్దరు కలిసి నగరంలో ఓ హోటల్‌కు వెళ్లిన సీసీటీవీ ఫుటేజ్ కూడా లభ్యమైంది. మరింత విచారణ కోసం మృతురాలి సెల్‌ఫోన్, సీసీటీవీ ఫుటేజ్, సూసైడ్ నోట్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించాం. ఫోరెన్సిక్ రిపోర్ట్, ప్రవల్లిక చాటింగ్స్ ఆధారంగా శివరామ్ రాథోడ్‌పై కేసు నమోదు చేస్తామని డీసీపీ వివరించారు. అలాగే సూసైడ్ నోట్, లెటర్‌పై ఉన్న హ్యాండ్ రైటింగ్ ప్రవల్లికదేనా కాదా అనేది నిర్ధారించేందుకు ఆమె నోట్‌బుక్స్ కూడా సీజ్ చేసినట్లు చెప్పారు.
ఏం జరిగిందంటే..
శుక్రవారం సాయంత్రం హాస్టల్‌లో ఎవరూ లేని సమయంలో ప్రవల్లిక ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తోటి విద్యార్థులు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. అప్పటికే అక్కడికి చేరుకున్న విద్యార్ధి సంఘాల నేతలు అడ్డుకున్నారు.