తెలంగాణ వీణ , హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నిన్న బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడం తెలిసిందే. అయితే, బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చిత్తు కాగితంతో పోల్చారు. ఒక్కటీ సొంత హామీ లేదని, తమ ఆరు గ్యారెంటీలను కాపీ కొట్టారని ఆరోపించారు.
రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను టిష్యూ పేపర్ తో పోల్చారు. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు ఎంతో ఉన్నతమైనవని, అలాంటి హామీలు ఇస్తామని కాంగ్రెస్ ఊహించలేకపోయిందని అన్నారు. అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా, తెలంగాణను అభివృద్ధి పథంలో పరుగు తీయించేలా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ఉందని కవిత కితాబిచ్చారు. అన్ని అంశాలను సరి చూసుకుని, సాధ్యాసాధ్యాలపై మదింపు చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో రూపొందించడం జరిగిందని స్పష్టం చేశారు. తమ మేనిఫెస్టోతో విపక్షాలకు దిమ్మదిరిగిపోయిందని అన్నారు.