తెలంగాణ వీణ , వనపర్తి : రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి.. అమలు చేస్తున్న సంక్షేమంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ప్రజల బాగోగులను పట్టించుకుంటున్న సీఎం కేసీఆర్‌కు, బీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టాలన్నారు. గురువారం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలో 28 అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
అలాగే పెబ్బేరులో 162, గుమ్మడంలో 100 మందికి డబుల్ ఇండ్లు, జర్నలిస్టులకు నివేశన స్థలాల పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తున్నారని తెలిపారు. తొమ్మిదిన్నరేండ్లలో ఊహించని అభివృద్ధి జరిగింది, మళ్లీ గులాబీ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మరింత ప్రగతి మెరిసేలా చేస్తామన్నారు. ఇప్పటికే పల్లె, పట్నం రూపురేఖలు మారిపోయాయని తెలిపారు.
ఐదేండ్లలో వనపర్తిని అన్ని రంగాల్లో ముందుంచిన ఘనత తనకే దక్కుతుందన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు ఎత్తిపోతల పథకంతో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్న ఘనత సీఎం కేసీఆర్‌దే అన్నారు. మిషన్ కాకతీయతో చెరువులకు పునర్జీవం, మిషన్ భగీరథతో తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
దళిత, బీసీ, మైనార్టీ బంధుతో చేతివృత్తులు, స్వయం ఉపాధిని ప్రోత్సహించినట్లు వివరించారు. ఎన్నికల సమీపిస్తున్న వేళ మాయమాటలు చెప్పేందుకు గ్రామాలు, పట్టణాలకు ప్రతిపక్షాల నాయకులు వస్తున్నారని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.