తెలంగాణ వీణ , జాతీయం : మతగ్రంథాలపై పేటెంట్ ఎవరికీ ఉండదని, అయితే.. బీఆర్ చోప్రా తీసిన మహాభారత్, ఫిలిం డైరెక్టర్ రమానంద్ సాగర్ తీసిన రామాయణ్ సీరియల్స్‌కు పైరసీ నుంచి రక్షణ ఉంటుందని ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భక్తివేదాంత బుక్ ట్రస్ట్ రచనలకు కూడా ఇదే వర్తిస్తుందని ధర్మాసనం పేర్కొన్నది. భక్తివేదాంత బుక్ ట్రస్ట్ పుస్తకాల్లోని కంటెంట్‌కు పేటెంట్ హక్కులు వర్తిస్తాయని, ఈ పుస్తకాల్లోని కంటెంట్‌ను తీసుకోకుండా కొన్ని సంస్థల్ని నిరోధిస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది.
ఈ అంశంపై ట్రస్ట్ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, ‘గ్రంథాన్ని బోధించే, వివరించే రచనల అసలు భాగాలకు కాపీరైట్ వర్తిస్తుంది. వీటిపై పైరసీని అనుమతించం’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రింట్, ఆడియో, విజువల్..ఇలా ఏ రూపంలోనూ ట్రస్ట్ బుక్స్‌ను కాపీరైట్ చేయరాదని, ఆన్‌లైన్ వెబ్‌సైట్స్, మొబైల్ అప్లికేషన్స్, వెబ్‌లింక్స్, సోషల్‌మీడియాలో చూపరాదని ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. గూగుల్, మెటాలకు కోర్టు ఆదేశాలు జారీచేసింది.