తెలంగాణ వీణ , హైదరాబాద్ : బీఆర్‌ఎస్ పార్టీ కి మరో షాక్ తగిలింది. పఠాన్‌చెరు నియోజకవర్గ అసమ్మతి నేత నీలం మధు ముదిరాజ్ బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. పార్టీ టికెట్ రాకపోవడంతో తీవ్ర మనస్థాపంతో బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజీనామా లేఖను పంపించారు. సోమవారం ఉదయం ఆయన స్వగ్రామం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామంలో మధు రాజీనామా ప్రకటన చేశారు. ఈసారి ఎన్నికల బరిలో ఉంటున్నట్లు వెల్లడించారు. కొత్తపల్లి గ్రామం నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. నీలం మధు చివరి క్షణం వరకు బీఆర్‌ఎస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి నిన్న బీఫాం రావడంతో నీలం మధు ముదిరాజ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
2001లో టీఆర్ఎస్‌లో చేరిన నీలం మధు.. 2014లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో చిట్కూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.