తెలంగాణవీణ, స్పెషల్ స్టోరీ : ఇస్రో… అనగానే మనం నింగివైపు చూస్తాం! కానీ ఈ కథ మనల్ని నేలవైపు చూడమంటుంది. ఎందుకంటే… ఇది ఆ సంస్థ తయారుచేసిన నావిగేషన్ వ్యవస్థ ‘నావిక్’కి సంబంధించింది కాబట్టి!మనం వాడుతున్న అమెరికన్ ‘జీపీఎస్’కన్నా ఎక్కువ కచ్చితత్వంతో పనిచేస్తుందిది. అందుకే- యాపిల్ సంస్థ ఇటీవల తమ ‘ఐఫోన్ 15 ప్రొ’ని ‘నావిక్’ వ్యవస్థతోనూ పనిచేసేలా రూపొందించింది. మామ్, చంద్రయాన్, ఆదిత్య-ఎల్1… ఇలా గత దశాబ్దంలో ఇస్రో సాధించిన విశిష్ట విజయాల్లో ‘నావిక్’ కూడా ఒకటని చెప్పొచ్చు. ఎందుకంటే…అది 1999… కార్గిల్ యుద్ధం జరుగుతోంది. భారత సైన్యం చావోరేవో అన్నట్టు పోరాడుతోంది. కార్గిల్ పర్వతాన్ని ఆక్రమించిన ముష్కరులపైన మిస్సైల్స్ వేస్తోంది. కానీ, ఆ శతఘ్నులు ఎప్పుడూ లక్ష్యానికి ఆమడదూరంలో పడుతున్నాయి! ఈ మిస్సైల్స్‌ని ప్రయోగించడానికి మనం వాడే నావిగేషన్ వ్యవస్థ- ‘గ్లోబల్ పొజిషినింగ్ సిస్టమ్'(జీపీఎస్) సరిగ్గా పనిచేయకపోవడం ఇందుక్కారణం. ఆ జీపీఎస్ అమెరికా ప్రభుత్వానికి చెందింది. దాంతో- కార్గిల్ పర్వతంపైన ఆ వ్యవస్థ బాగా పనిచేసేలా చూడమని భారత్ అగ్రరాజ్యాన్ని ఎంతగానో అభ్యర్థించింది. కానీ- ఆనాడు పాకిస్థాన్ తమ మిత్రదేశం కాబట్టి ఆ అభ్యర్థనల్ని అమెరికా పెడచెవినపెట్టింది. జీపీఎస్ లేకున్నా సరే భారత సైనికుల వీరోచిత పోరాటంతో కార్గిల్ విజయం మన సొంతమైంది. అయినా- కీలక ఘట్టంలో జీపీఎస్ సహకారం లేకపోవడాన్ని భారత ప్రభుత్వ యంత్రాంగం మరచిపోలేదు. అందుకే మనకంటూ ఓ నావిగేషన్ వ్యవస్థని రూపొందించాలనుకుంది. ఇందుకోసం 2006లో ‘ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్’ (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్) ప్రాజెక్టుని ప్రారంభించింది. ఈ ప్రాజెక్టుకి డైరెక్టర్‌గా తెలుగు శాస్త్రవేత్త ముప్పాళ్ళ నాగేశ్వరరావుని నియమించింది. ముందు మన చిరకాల మిత్రదేశం రష్యాతో కలిసే ఈ ప్రాజెక్టుని చేపట్టాలనుకున్నాం. కానీ ఆ దేశం ‘మీ సామర్థ్యంపైన మాకంత నమ్మకంలేదు’ అంటూ మధ్యలోనే తప్పుకుంది. భారత్ దాన్నో సవాలుగా తీసుకుంది.
2006 నుంచి ఏడేళ్ళ పరిశోధన తర్వాత…2013లో ‘ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎ’తో తొలి నేవిగేషన్ శాటిలైట్‌ని నింగిలోకి పంపింది భారత్. ఆ తర్వాత మరో ఆరు శాటిలైట్‌లని విజయవంతంగా అంతరిక్షంలో నిలబెట్టగలిగింది. ఇందుకోసం రూ.1450 కోట్లు ఖర్చుపెట్టింది. దానికి నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టలేషన్… క్లుప్తంగా ‘నావిక్’ అని పేరుపెట్టింది. ఒక్క భారత్‌లో మాత్రమే కాకుండా- చుట్టుపక్కల మరో 1500 కిలోమీటర్ల దాకా ఇది పనిచేస్తుంది. ముందుగా- మన భారత వైమానిక దళం దీన్ని ఉపయోగించడం మొదలుపెట్టింది. అనతికాలంలోనే అమెరికన్ జీపీఎస్ వ్యవస్థకన్నా ఎక్కువ కచ్చితత్వం (ఆక్యురసీ)తో పనిచేస్తోందన్న పేరు తెచ్చుకుంది. ఉదాహరణకి- మీరో కారునో బస్సునో ట్రాక్ చేయాలనుకుందాం లేదా ఓ అడ్రెస్‌ని కనిపెట్టాలనుకుందాం. జీపీఎస్ మీరు కోరుకున్న వాహనం లేదా స్థలానికి 20 మీటర్లు అటూఇటూగా మిమ్మల్ని తీసుకెళుతుంది. కానీ- నావిక్ కేవలం ఐదు మీటర్ల వ్యత్యాసాన్నే చూపిస్తుంది! అంటే- జీపీఎస్ కన్నా నావిక్ కచ్చితత్వం నాలుగురెట్లు ఎక్కువన్నమాట!ఇప్పుడు మనం వాడుతున్న జీపీఎస్ వ్యవస్థ కొండల్లో పనిచేయదు. కానీ-నావిక్ ఏ కొండాకోనల్లో అయినా పనిచేయగలుగుతుంది. ‘గూగుల్ మ్యాప్’లాంటి ఆప్‌లని దీనికి అనుసంధానం చేస్తే ఘాట్‌రోడ్డుల్లో జీపీఎస్‌కన్నా మెరుగ్గా సేవలందించగలుగుతుంది.
ఇప్పటికే మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ తదితర సంస్థలు ‘నావిక్’తో పనిచేసే కార్లను రోడ్డుపైకి తెచ్చాయి. అంతేకాకుండా, ఇకపైన మనదేశంలో వాణిజ్యావసరాల కోసం వాడే బస్సులూ, ట్రక్కులూ, కార్లూ తదితర వాహనాలన్నింటికీ ఈ నావిగేషన్ వ్యవస్థని వాడటం తప్పనిసరి చేసింది కేంద్రప్రభుత్వం. ఆ తర్వాత- మొబైల్ ఫోన్ తయారీదారులూ దీన్ని వాడేలా చర్యలు చేపట్టింది. ముందుగా రియల్ మీ, షామీ, వన్ ప్లస్, ఒప్పో వంటి సంస్థలు నావిక్‌తో పనిచేసే ఫోన్లని మార్కెట్‌లోకి తెచ్చాయి. వీటికి తలమానికంగా- ఆపిల్ సంస్థ తమ తాజా ‘ఐఫోన్ 15 ప్రొ’ మొబైల్‌ని ‘నావిక్’ వ్యవస్థకి అనుగుణంగా మార్పుచేసింది. 2025కల్లా అన్ని స్మార్ట్‌ఫోన్లనూ నావిక్‌ని వాడటం తప్పనిసరంటూ కేంద్రం ప్రకటించడంతో ఇతర సంస్థలూ దాదాపు అన్ని ఫోన్లలోనూ ఈ వ్యవస్థని తీసుకురాబోతున్నాయి.1973లో ప్రారంభమైన అమెరికన్ జీపీఎస్ వ్యవస్థ ప్రస్తుతం 32 శాటిలైట్‌లతో ప్రపంచవ్యాప్తంగా ఉచిత సేవల్ని అందిస్తోంది. రష్యా(గ్లోనాస్), యురోపియన్ యూనియన్ , జపాన్, చైనా(బైడూ)లకీ ఈ వ్యవస్థ ఉన్నా… అవి ఆయాదేశాలకే పరిమితమవుతున్నాయి. కానీ- అమెరికాలాగే భారత్ కూడా ప్రపంచవ్యాప్తంగా సేవలందించడానికి సిద్ధమవుతోంది. ఇందుకోసం, సమీప భవిష్యత్తులో 24 శాటిలైట్‌లని నింగిలోకి పంపబోతున్నాం. ఇదిలా ఉంటే- ఒకప్పుడు మన సైన్యానికి జీపీఎస్ సేవల్ని అందించడానికి నిరాకరించిన అమెరికా- ఇటీవల నావిక్‌ని తమ మిత్ర(అలైడ్) నావిగేషన్ వ్యవస్థగా ప్రకటించడం… కొసమెరుపు..