తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఈనెల 23న తిరుపతికి రానున్నారు. 24న తిరుమలకు వెళ్లి శ్రీవారి దర్శనంతరం నారావారిపల్లికి వెళ్లనున్నారు. నారావారిపల్లెలో కులదైవం నాగాలమ్మకు, గ్రామ దేవత దొడ్డి గంగమ్మకు పూజలు చేయనున్నారు. అలాగే ఎన్టీఆర్ విగ్రహానికి, చంద్రబాబు తల్లిదండ్రులు నారా ఖర్జురపు నాయుడు, అమ్మణ్ణమ్మల సమాదులకు నివాళిలర్పిస్తారు. 25న చంద్రగిరిలో జరిగే ‘నిజం గెలవాలి’ తొలి బహిరంగ సభలో నారా భువనేశ్వరి పాల్గొంటారు.
కాగా టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును ప్రజలకు వివరించడంతోపాటు, సీఎం జగన్ ప్రజావ్యతిరేక పాలనను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ నడుం బిగించింది. అదేవిధంగా టీడీపీ సానుభూతిపరుల ఓట్లను జాబితాల నుంచి తొలగించడం, అనర్హత ఓట్లను చేర్పించడంపై పార్టీ పోరు సాగించనుంది. ఇక, చంద్రబాబు అరెస్టుతో మానసికంగా కుంగిపోయి మృతి చెందిన కుటుంబాలకు పార్టీ అండగా నిలవనుంది. ఈ మేరకు మూడు కార్యక్రమాల ద్వారా త్వరలోనే ప్రజల్లోకి వెళ్లేలా టీడీపీ ప్రణాళికలు సిద్ధం చేసింది. శనివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో ఆయా కార్యక్రమాలను ఖరారు చేశారు. చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వీటిని ప్రకటించారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈ నెల 25 నుంచి ‘నిజం గెలవాలి’ పేరుతో పర్యటించనున్నారు. ఈ పర్యటనను చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి ప్రారంభించనున్నారు. భువనేశ్వరి ఈ నెల 24న తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం చంద్రబాబు స్వగ్రామం నారావారి పల్లెకు వెళ్లి బస చేస్తారు. మర్నాడు చంద్రగిరి నియోజకవర్గం నుంచి ‘నిజం గెలవాలి’ పర్యటనను ప్రారంభిస్తారు.