తెలంగాణ వీణ , హైదరాబాద్ : ఒకే కుటుంబానికి రెండు టికెట్ల పంచాయితీ ఇప్పుడు కాంగ్రెస్‌లో అగ్గిరాజేస్తున్నది. మొన్నటి వరకు ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను సాకుగా చూపుతూ ‘ఒకే కుటుంబం-ఒకే టికెట్’ అంటూ సుద్దులు చెప్పిన అధిష్ఠానం ఇప్పుడు యూటర్న్ తీసుకున్నది. ఇప్పటికే పలువురు నేతల కుటుంబాలకు రెండేసి టికెట్లపై హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారానికి మైనంపల్లి హన్మంతరావు ఆజ్యం పోసినట్టు చెబుతున్నారు.ఆయనకు, కుమారుడు రోహిత్‌కు టికెట్లు ఇస్తామన్న హామీతోనే కాంగ్రెస్ ఆయనను పార్టీలో చేర్చుకున్నది. ఈ వ్యవహారం బయటకు రావడంతో ఇప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న నేతలు ఇప్పుడు అధిష్ఠానంపై ఎదురుదాడి మొదలుపెట్టారు. కొత్తగా వచ్చిన వ్యక్తికే రెండేసి టికెట్లు ఇస్తే, పార్టీనే నమ్ముకుని ఎప్పటి నుంచో ఉన్న తమ సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. తప్పక తలొగ్గిన కాంగ్రెస్ పెద్దలు మరికొందరు నేతలకు కూడా రెండు టికెట్లు ఆఫర్ చేసినట్టు తెలుస్తున్నది.