తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం–హైదరాబాద్ మధ్య రూ.1,932 కోట్లతో చేపట్టే మల్టీ ప్రొడక్ట్ పైప్‌లైన్‌వల్ల తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. అలాగే, నాగ్‌పూర్–విజయవాడ కారిడార్‌వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయన్నారు. ఈ మూడు రాష్ట్రాల్లో వాణిజ్యం, పర్యాటకం, పారిశ్రామిక రంగాలకు ప్రయోజనం చేకూరుతుందని.. ఈ కారిడార్‌లో కొన్ని ముఖ్యమైన ఆర్థిక కేంద్రాలను కూడా గుర్తించామని ఆయన చెప్పారు.
ఇందులో ఎనిమిది ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఐదు మెగా ఫుడ్ పార్కులు, నాలుగు ఫిషింగ్ సీ ఫుడ్ క్లస్టర్లు, మూడు ఫార్మా అండ్ మెడికల్ క్లస్టర్లు.. ఒక టెక్స్‌టైల్ క్లస్టర్ ఉన్నాయని ఆయన వివరించారు. ఇక దేశంలో నిర్మిస్తున్న ఐదు టెక్స్‌టైల్ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించామని.. హన్మకొండలో నిర్మించే ఈ పార్క్‌తో వరంగల్, ఖమ్మం ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.
పాలమూరు పర్యటనకు ఆదివారం వచ్చిన మోదీ.. తెలంగాణ రాష్ట్రానికి పలు వరాలు ప్రకటించారు. రాష్ట్ర రైతులు ఎంతోకాలం నుంచి డిమాండ్ చేస్తున్న జాతీయ పసుపు బోర్డును, ఉమ్మడి ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు సెంట్రల్ గిరిజన యూనివర్సిటీని రాష్ట్రంలో ఏర్పాటుచేయనున్నట్లు ఆయన తెలిపారు.