తెలంగాణ వీణ , హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు(మంగళవారం) తెలంగాణలో పర్యటించనున్నారు. కర్ణాటక రాష్ట్రం బీదర్ నుంచి నిజామాబాద్ జిల్లాకు రానున్నారు. జిల్లాలో రూ.8 వేల కోట్ల విలువైన పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో రాజకీయ ప్రసంగం చేయనున్నారు. బీఆర్‌ఎస్, ఎంఐఎంతోపాటు కాంగ్రెస్‌పైనా విమర్శలు ఉంటాయంటుని బీజేపీ పార్టీ నేతలు అంటున్నారు. కాగా కేవలం మూడు రోజుల వ్యవధిలోనే తెలంగాణలో మోదీ రెండోసారి పర్యటిస్తున్నారు. ఈ నెల 1న మహబూబ్‌నగర్‌లో రూ.13,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపిన ప్రధాని.. మంగళవారం నిజామాబాద్‌లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తర్వాత ఇక్కడి గిరిరాజ్ కాలేజీ మైదానంలో నిర్వహించే బీజేపీ బహిరంగ సభలో రాజకీయ ప్రసంగం చేయనున్నారు. పాలమూరు పర్యటనలో బీఆర్‌ఎస్, ఎంఐఎంలపై విమర్శలు గుప్పించిన ప్రధాని మోదీ.. నిజామాబాద్‌లో ఏం మాట్లాడుతారు, ఎలాంటి విమర్శలు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.