తెలంగాణవీణ, జాతీయం : జాతీయ స్థాయిలో కులగణన చేపట్టాలన్న కాంగ్రెస్ డిమాండ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. ఆ వంకతో హిందువులను విభజించేందుకు, తద్వారా దేశాన్ని నాశనం చేసేందుకు ఆ పార్టీ కుట్ర చేస్తోందని ఆరోపించారు.’కుల గణన చేపట్టి జనాభా ఆధారంగా వనరులను పంచాలనడంలో కాంగ్రెస్ ఉద్దేశం ఏమిటి తద్వారా ముస్లింలు, మైనారిటీల హక్కులను తగ్గించాలనుకుంటోందా? దేశంలో ఎవరి జనాభా ఎక్కువగా ఉంది? అత్యధిక జనాభాగా ఉన్న హిందువులే ముందుకొచ్చి హక్కులన్నీ తమకే కావాలని డిమాండ్ చేయాలా? కాంగ్రెస్ ఆశిస్తున్నదేమిటి?’ అని మండిపడ్డారు.’పేదలే నా తొలి ప్రాథమ్యం. కుల మతాలతో నిమిత్తం లేకుండా వనరులపై తొలి హక్కు వారికే చెందాలన్నది నా అభిమతం. కానీ కాంగ్రెస్ మాత్రం కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కులం, మతం ఆధారంగా సమాజాన్ని విడదీయాలని చూస్తోంది’ అని దుయ్యబట్టారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గడ్‌లో మంగళవారం జగ్దల్‌పూర్‌లో పరివర్తన్ మహా సంకల్ప ర్యాలీలో మోదీ మాట్లాడారు.బిహార్‌లో సీఎం నితీశ్ కుమార్ తాజాగా కుల గణన వివరాలు వెల్లడించడం, దాన్ని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అభినందించడం తెలిసిందే. అంతేగాక ప్రజలకు జనాభాలో వారి శాతానికి అనుగుణమైన నిష్పత్తిలో హక్కులు కల్పించేందుకు వీలుగా దేశమంతా కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.