తెలంగాణ వీణ , హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని మంత్రి హరీశ్ రావు లాంఛనంగా ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాల జిల్లా పరిషత్ పాఠశాలలో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఈ కార్యక్రమాన్ని ఆరంభించారు. విద్యార్థులకు అల్పాహారాన్ని వడ్డించారు. అనంతరం వారితో కలిసి టిఫిన్ చేశారు. ఈ సందర్భంగా తన పక్కన కూర్చున్న చిన్నారులకు మంత్రి హరీశ్ రావు ఇడ్లీ తినిపించారు. వారితో ముచ్చటించారు. మంత్రి సబిత కూడా విద్యార్థులకు తినిపించారు.
ఈ పథకంద్వారా రాష్ట్రంలోని 27,147 పాఠశాలల్లో 23 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ప్రతిరోజూ పాఠశాల ఆరంభానికి అరగంట ముందు 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు అల్పాహారం అందించనున్నారు. అయితే బ్రేక్‌ఫాస్ట్ అంటే మొక్కుబడిగా కాకుండా అందరూ ఆశ్చర్యపోయేలా ప్రభుత్వం మెనూను సిద్ధం చేసింది. మిల్లెట్ ఇడ్లీ, ఇడ్లీ సాంబార్, ఉప్మా, పూరి, టమాటా బాత్, కిచిడీ, పొంగల్, పోహా, వెజిటబుల్ పొలావ్ రకరకాల టిఫిన్లను అందించనున్నది. ప్రభుత్వం ఇప్పటికే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, స్నాక్స్, కోడిగుడ్లను అందిస్తున్న విషయం తెలిసిందే.
తొలుత దీనిని తమిళనాడులోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించారు. ఆ తర్వాత ఈ పథకాన్ని ప్రారంభించిన రెండో రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తున్నది. తమిళనాడులో 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకే అల్పాహారాన్ని అందిస్తున్నారు. కానీ, మన రాష్ట్రంలో 1 -10 తరగతుల్లోని విద్యార్థులందరికీ బ్రేక్‌ఫాస్ట్ అందిస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పలు రాష్ర్టాల్లో 1 -8 తరగతుల వరకే అందిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో 9, 10 తరగతుల విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనాన్ని అందజేస్తున్న విషయం తెలిసిందే. గతేడాది నుంచి బెల్లం కలిపిన రాగిజావను అందజేస్తున్నది. పదో తరతతి విద్యార్థులకు స్పెషల్ క్లాస్ సమయంలో ఉచితంగా స్నాక్స్‌ను ఏర్పాటు చేసింది.