తెలంగాణ వీణ, సినిమా : పాయల్ రాజ్ పుత్, నందిత శ్వేత, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో అజయ్ భూపతి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘మంగళవారం’. ఈ చిత్రం మధురా మీడియా వర్క్స్, ఏ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేశ్ వర్మ నిర్మాతలుగా తెరకెక్కుతోంది. కాగా, మంగళవారం సినిమా ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి నేడు రిలీజ్ చేశారు. తన సోషల్ మీడియా ఖాతాలో ట్రైలర్ లింకు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ లో ఆసక్తికరంగా స్పందించారు. “మంగళవారం చిత్ర నిర్మాతలు స్వాతిరెడ్డి గునుపాటి, సురేశ్ వర్మ నాకు సన్నిహితులు. ముఖ్యంగా, స్వాతి రెడ్డి ఎంతో డైనమిక్ అమ్మాయి. స్వాతిరెడ్డి మా అమ్మాయి శ్రీజకు మంచి స్నేహితురాలు. యువత, ముఖ్యంగా యంగ్ ఉమెన్ చిత్ర పరిశ్రమలో వివిధ శాఖల్లోకి ఎంటరవుతుంటే చాలా ఎగ్జయిటింగ్ గా అనిపిస్తుంటుంది నాకు. తమ కొత్త ఆలోచనలు, కొత్త ఎనర్జీతో వాళ్లు ఫిలిం మేకింగ్, మార్కెటింగ్ లకు కొత్త రూపును ఇవ్వగలరు. స్వాతిరెడ్డి వంటి యంగ్ స్టర్ చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి అజయ్ భూపతి వంటి ప్రతిభావంతుడైన దర్శకుడితో కలిసి తొలి ప్రయత్నంగా ‘మంగళవారం’ సినిమా చేయడం ఎంతో సంతోషం కలిగిస్తోంది. విలేజ్ నేపథ్యంలో రస్టిక్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ నా చేతుల మీదుగా రిలీజ్ అవుతున్నందుకు ఆనందంగా ఉంది. ఈ చిత్రం సూపర్ డూపర్ సక్సెస్ సాధించాలని కోరుకుంటూ యావత్ చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను” అని పేర్కొన్నారు.