తెలంగాణ వీణ ,హైదరాబాద్ : మెదక్ డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరారు. శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో తిరుపతిరెడ్డితోపాటు ఆయన అనుచరులు భారీ సంఖ్యలో గులాబీ కండువా కప్పుకున్నారు. వీరిని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాదరంగా స్వాగతించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడిన తిరుపతిరెడ్డి లాంటి నాయకులను కాంగ్రెస్ బలవంతంగా బయటకి పంపించిందని చెప్పారు. తిరుపతిరెడ్డితోపాటు బీఆర్‌ఎస్‌లో చేరిన ప్రతి ఒకరినీ కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. పార్టీలో చేరిన వారికి సముచిత గౌరవం దక్కుతుందని అభయమిచ్చారు.
కాంగ్రెస్‌కు పుట్టగతులుండవు : కే తిరుపతిరెడ్డి
గత పదేండ్లుగా కాంగ్రెస్ పార్టీని మెదక్ జిల్లాలో బలోపేతం చేసేందుకు శాయశక్తుల కృషి చేశానని, తనకు టికెట్ ఇస్తానని చివరకు మోసం చేశారని తిరుపతిరెడ్డి మండిపడ్డారు. పార్టీలో కష్టపడి ప్రజలతో మమేకమైన నాయకులకు కాకుండా డబ్బు సంచులతో వచ్చిన పారాచూట్ నాయకులకే కాంగ్రెస్ టికెట్లు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు. తనతోపాటు జిల్లాలోని అన్ని మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరారని చెప్పారు. మెదక్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు. మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్‌లో చేరిన తరువాత ఆ పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతున్నది. ఏకం గా డీసీసీ అధ్యక్షులే రాజీనామాలు చేస్తున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నందికంటి శ్రీధర్ ఇప్పటికే బీఆర్‌ఎస్‌లో చేరగా, తాజాగా తిరుపతిరెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు.