తెలంగాణ వీణ , హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో కీలక నాయకుడు మన్నెం రంజిత్ యాదవ్ పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్న ఆయన.. కారు దిగేందుకు ఇప్పటికే ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 500 మందితో కలిసి కాషాయ కండువా కప్పుకొనేందుకు ఇప్పటికే ఏర్పాట్లు సైతం పూర్తయినట్లు సమాచారం.
నియోజకవర్గ, నాయకులతో కలిసి రెండు రోజులు క్రితం బీజేపీ రాష్ట్ర నాయకులతో చర్చలు జరిపినట్లు తెలిసింది. బీజేపీలోకి రావాలని పార్టీ నాయకులు ఆ యంగ్ లీడర్‌ను ఆహ్వానించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కీలక నేతల హామీ మేరకు బీజేపీలో చేరాలని యువ నాయకుడు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే ఆయన బీజేపీలో అధికారికంగా చేరనున్నట్లు తెలుస్తోంది.
కొద్ది కాలంగా బీఆర్ఎస్‌లో తనకు లభించే ప్రాధాన్యత మూలంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. జనాల్లో ఆదరణ ఉన్న బీసీ నాయకుడు విదేశాల నుంచి స్వదేశానికి సేవ చేయాలనే ఆలోచనలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. యాదవ్ సామాజికవర్గం నుంచి గట్టి పట్టు ఉన్న నాయకుడు మన్నెం రంజిత్ యాదవ్ బీజేపీలోకి వస్తే పార్టీ మరింత బలపడుతుందని బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.