Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

నేడు ‘ఉక్కు మనిషి’ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి

Must read

తెలంగాణ వీణ , ఎడిటోరియల్ : సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయనకు హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ…..

సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత దేశపు ఉక్కు మనిషి. 1875 అక్టోబర్ 31 న గుజరాత్ లోని నాడియార్ లో జన్మించారు. అతని తండ్రి జావర్ భాయ్ పటేల్ ఒక సాధారణ రైతు మరియు తల్లి లాడ్ బాయి ఒక సాధారణ మహిళ. భారత స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన సామాజిక, రాజకీయ నాయకుడు వల్లభ భాయ్ పటేల్. స్వతంత్ర భారత దేశ సమగ్రతకు, సమైక్యతకు మార్గ నిర్దేశం చేసిన మహనీయుడు. ఆయనను భారత దేశ ఉక్కు మనిషి, సర్దార్ అని పిలుస్తారు. సర్దార్ అంటే నాయకుడని అర్ధం. మహాత్మా గాంధీ సిద్ధాంతాలపట్ల ఆకర్షితుడయ్యే నాటికే వల్లభ భాయ్ పటేల్ న్యాయవాదిగా పేరు గడించారు. ఆతరువాతి కాలంలో పటేల్ గుజరాత్ లోని ఖేడా, బొర్సాద్, బార్డోలిల రైతులను బ్రిటిష్ పాలకుల అణచివేత విధానాలకు వ్యతిరేకంగా అహింసా పూర్వక శాసనోల్లంఘన ఉద్యమంతో సంఘటితం చేశారు.
భారత దేశ తొలి హోంమంత్రిగా, ఉపప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పటేల్ శరణార్ధుల కొరకు పంజాబ్, ఢిల్లీలలో సహాయ కార్యక్రమాలు నిర్వహించి దేశ వ్యాప్తంగా శాంతి నెలకొల్పారు. ముందు నుంచీ విభజించు పాలించు విధానాన్ని అవలంభించిన ఆంగ్లేయులు మత ప్రాతిపదికన దేశాన్ని రెండు ముక్కలు చేశారు. అలాగే వెళ్తూ వెళ్తూ దేశంలోని సంస్థానాలకు స్వయం నిర్ణయాధికారాన్ని కూడా కట్టబెట్టారు. దీని ప్రకారం తమకు నచ్చితే సంస్థానాధీశులు భారత్ యూనియన్ లో కలవచ్చు లేదా స్వతంత్రంగా వ్యవహరించవచ్చు. ఈ సమస్యను తనదైన శైలిలో పరిష్కరించి ఇండియన్ బిస్మార్క్ గా వల్లభాయ్ పటేల్ మన్ననలు అందుకున్నారు. జర్మనీ ఏకీకరణలో బిస్మార్క్ పాత్ర ఎలాంటిదో భారత యూనియన్ లో స్వదేశీ సంస్థానాలు విలీనంలో పటేల్ ఉక్కు సంకల్పం అలాంటిది.
1947 నాటికి దేశంలో 565 స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. వీటిలో కశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ మినహా మిగిలినవి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితో బేషరతుగా ఇండియన్ యూనియన్ లో అంతర్భాగమయ్యాయి. మిగతా మూడు సంస్థానాలను భారత్ యూనియన్ లో విలీనం చేయడానికి పటేల్ పట్టుదలతో వ్యవహరించారు. వీటిలో ముఖ్యమైంది హైదరాబాద్ సంస్థానం. ఇందులోని 80 శాతం ప్రజలు హిందువులు, మిగతా 20 శాతం ముస్లింలు ఇతర మతాలకు చెందినవారు. ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా పేరొందిన ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ సంస్థానాన్ని ముస్లిం రాజ్యంగా చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. తమ సంస్థానానికి సొంత కరెన్సీ, రైల్వే, సైనిక వ్యవస్థలు ఉండటంతో హైదరాబాద్ ను స్వతంత్ర రాజ్యంగా ఉంచాలనే ఆలోచన ఆయనది. మరికొంతకాలం వేచి చూసిన తర్వాత ఇండియన్ యూనియన్ లో విలీనం చేస్తానని ఏడో నిజాం ప్రతిపాదించాదు. కానీ నిజాం వైఖరి పట్ల అనుమానంగా ఉన్న పటేల్ అందుకు ఒప్పు కోలేదు. నిజాం సంస్థానంలోని రజాకార్లు మతకల్లోలాలను సృష్టించి ఆ ప్రాంతంలోని ప్రజలను భయ బ్రాంతులకు గురి చేశారు. ఇదే సరైన సమయంగా భావించిన పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా సైనిక చర్యను చేపట్టీ హైదరాబాద్ సంస్థానాన్ని స్వాధీనంచేసుకోవాలని నిర్ణయించారు. దానికి అనుగుణంగానే 1947 సెప్టెంబరు 13 న ప్రారంభమైన ఆపరేషన్ మూడు రోజుల పాటు కొనసాగి అదే నెల 17 న ముగిసింది.

సైనిక చర్యను ప్రధాని నెహ్రూ వ్యతిరేకించినా ఆయన ఆదేశాలను పట్టించుకోకుండా హైదరాబాద్ ప్రజలకు కిసాన్ వీరుడు విముక్తి కలిగించారు. నెహ్రూ యూరప్ పర్యటనలో ఉన్నపుడు ఇదే సైనిక చర్యకు సరైన సమయంగా భావించిన పటేల్ ఇండియన్ ఆర్మీకి ఆదేశాలు జారీ చేశారు. కశ్మీర్ ది మరో విచిత్రమైన పరిస్థితి . ఈ సంస్థానాధీశుడు రాజా హరిసింగ్ భారత్ యూనియన్ లొ కశ్మీర్ ను విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఉత్తర కశ్మీర్ లోని వేర్పాటువాదులు దీన్ని వ్యతిరేకించారు. దీనిపై కూడా సైనిక చర్య ద్వారా శాశ్వత పరిష్కారం చేయాలని పటేల్ భావించినా అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ దీనికి అంగీకరించ లేదు. అప్పుడే గనుక నెహ్రూ ఒప్పుకుని ఉంటే కశ్మీర్ సమస్య ఇంతవరకు వచ్చుండేది కాదేమో..
సంస్థానాలను విలీనం చేసి భారతదేశ సమైక్యతకు పాటుపడిన సర్దార్ వల్లభాయ్ పటేల్ రూపంలో భారత ప్రభుత్వము, గుజరాత్ లోని నర్మదా నది తీరంలో, కెవాడియా కాలని లో స్టాట్యూ ఆఫ్ యూనిటీ (తెలుగులో ఐక్యతా ప్రతిమ/ ఐక్యతా విగ్రహం) పేరుతో, 182 మీటర్ల ఎత్తులో ఒక స్మారక కట్టడం నిర్మించి, 31 అక్టోబర్ 2018 న భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ చేతులమీదుగా జాతికి అంకితం చేసింది. అది ప్రస్తుతము ప్రపంచము లోనే ఎత్తైన విగ్రహంగా, ప్రముఖ పర్యాటక కేంద్రంగా, దేశ సమైక్యతకు ల్యాండ్ మార్క్ గా ప్రఖ్యాతి గాంచింది.

ఉక్కు మనిషి, సమైక్యసారధి, రైతు బాంధవుడు ఐన సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మ దిన సందర్భంగా శుభాకాంక్షలతో..

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you