తెలంగాణ వీణ , జాతీయం : ప్రేమ పెళ్లిళ్ల గురించి ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మేజర్లు అయిన యువతీ యువకులు తమకు నచ్చినవారిని పెళ్లి చేసుకునే హక్కు వారికి ఉందని పేర్కొంది. వారి నిర్ణయాన్ని తల్లిదండ్రులు కానీ, కుటుంబ సభ్యులు కానీ అడ్డుచెప్పరాదని స్పష్టం చేసింది. రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం…నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు ఉంటుందని తేల్చి చెప్పింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత వారిని విడదీసే హక్కు ఎవరికీ లేదని పేర్కొంది. ఇటీవల పెద్దలను ఎదురించి తమ కుటుంబాల ఇష్టాలకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్న ఓ ప్రేమజంటకు తన కుటుంబం నుంచి బెదిరింపులు వచ్చాయి. దీంతో వారు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్ స్వీకరించిన కోర్టు ఆ జంటకు పోలీసు రక్షణ కల్పించాలని ఆదేశించింది. వారి భద్రత బాధ్యత ప్రభుత్వాలేదనని హైకోర్టు సంచలనతీర్పు ఇచ్చింది.విచారణ సందర్భంగా జస్టిస్ తుషార్ రావు గేదెల మాట్లాడుతూ…పౌరులకు భద్రత కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అన్నారు. పిటిషనర్ తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు ఉందని…ఏవిధంగా వారి వివాహం బలహీనపరచకూడదని పేర్కొన్నారు. వారిద్దరూ కూడా మేజర్లే కాబట్టి వారు చేసుకున్న పెళ్లి చట్టబద్దమైందేనన్నారు. కాగా ఈ పిటిషన్ దాఖలు చేసిన జంట పెద్దలను ఎదురించి ఈ ఏడాది ఏప్రిల్ లో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి సంతోషంగానే ఉన్నారు. అయితే ఈ మధ్యే వీరి కుటుంబ సభ్యులు బెదిరింపులకు దిగారు. దీంతో వారు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ వాదలనలను విన్న తర్వాత కొత్త జంటకు భద్రత కల్పించాలని వారి తల్లిదండ్రుల నుంచి ఎలాంటి హాని కలగకుండా చూసుకోవాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.