తెలంగాణ వీణ, హైదరాబాద్ : పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతూ హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడిన ప్రవళిక కేసు కీలక మలుపుతిరిగింది. ప్రేమ వ్యవహారమే ఆమె ఆత్మహత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పోలీసులు మీడియాతో మాట్లాడుతూ ‘‘ప్రవళిక చనిపోయినట్టు మాకు సమాచారం అందింది. ఆమె గదిలో సూసైడ్ నోట్ దొరికింది. ఇప్పటివరకు ఆమె ఏ పోటీ పరీక్షకు హాజరు కాలేదు. ఆత్మహత్యపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. శివరామ్ రాథోడ్ అనే వ్యక్తితో ఆమె చేసిన చాటింగ్‌ను గుర్తించాం. తనను మోసం చేసి శివరామ్ మరో యువతిని పెళ్లి చేసుకోబోతున్నట్టు ఆ చాటింగ్ ద్వారా గుర్తించాం.శివరామ్, ప్రవళిక ఇద్దరూ నగరంలోని ఓ హోటల్‌కు వెళ్లినట్టు సీసీ టీవీ ఫుటేజ్ కూడా దొరికింది. న్యాయపరంగా శివరామ్‌పై చర్యలు తీసుకుంటాం. మృతురాలి సెల్‌ఫోన్, సీసీటీవీ ఫుటేజ్, సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నాం. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి ఆధారాలు సేకరిస్తాం. గ్రూప్-2 పరీక్ష రాసేందుకు ఆమె హైదరాబాద్ వచ్చినట్టు దర్యాప్తులో తేలింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరించాం. వ్యక్తిగత కారణాలతోనే అభ్యర్థిని ఆత్మహత్య చేసుకుందని తోటి విద్యార్థులు చెప్పినా పట్టించుకోకుండా విద్యార్థి సంఘాలు, రాజకీయ శ్రేణులు ఆందోళనకు దిగాయి’’ అని పోలీసులు మీడియాకు వివరించారు.