తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టయి, జైలుకు వెళ్లిన తర్వాత ఆయన కుమారుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 14వ తేదీన ఢిల్లీ వెళ్లిన నారా లోకేష్ . అక్టోబర్ 5 వరకు దేశ రాజధానిలోనే ఉన్నారు. ఢిల్లీలో ఉండటంపై లోకేష్ చెబుతున్న మాటలు రెండే రెండు. ‘‘ఒకటి బాబు అరెస్ట్‌పై జాతీయ నేతల మద్దతు కోరడం, రెండు న్యాయకోవిదులతో చర్చలు’’.
ఢిల్లీ మకాంపై విమర్శలు
అయితే లోకేష్ ఇన్ని రోజులు ఢిల్లీలో గడపడం తప్పుడు వ్యూహమంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తండ్రి అరెస్ట్ అయి జైలులో ఉంటే.. రాష్ట్రంలో ఉండి పార్టీని, పార్టీ కార్యకలాపాలను ముందుండి నడిపించాల్సిన నేత దేశ రాజధానిలో మకాం వేయడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీకి ఒక నాయకుడిగా, ప్రత్యామ్నాయ నేతగా ఎదగడానికి వచ్చిన అవకాశాన్ని కూడా లోకేష్ వదులుకుంటున్నాడనే చెబుతున్నారు. ఇక ఏపీకి వస్తే సీఐడీ అరెస్ట్ చేస్తుందనే లోకేష్ ఢిల్లీకి పరారయ్యరనేది కూడా మరో విమర్శ.
టీడీపీ ఏ కూటమిలో లేకపోవడమే కారణం
తాజాగా చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై జాతీయ నేతలు స్పందించలేకపోవడం, లోకేష్ ఢిల్లీ పర్యటనపై ప్రొఫెసర్ కే నాగేశ్వరరావు చర్చించారు. ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో ఏ జాతీయ నాయకులు కలిసి, బాబుకు అనుకూలంగా నిరసన తెలిపిన దాఖలాలు లేవని అన్నారు. ఎందుకంటే టీడీపీ ఏ కూటమిలో లేకపోవడమే ఇందుకు కారణమని తెలిపారు. అటు బీజేపీతోనూ, ఇటు ప్రతిపక్షాల ఇండియా కూటమిలోనూ లేదు. మమతాబెనర్జీ వంటి వారు స్పందించినా, పెద్ద ఎత్తున రాజకీయ స్పందన రావడానికి అవకాశమే లేదన్నారు. కారణం బాబు చేసుకున్న స్వయంకృతాపరధమేనని చెప్పారు.
ఒకప్పుడు మోదీని విమర్శించి.. ఇప్పుడు..
2019కు ముందు ఎన్డీయేను వదిలి బీజేపీయేతర పార్టీలతో కలిసి నానా హడావిడీ చేశారని,. 2019 తర్వాత పొరపాటున బీజేపిని ఏ మాటున విమర్శించకుండా, ఏ ప్రతిపక్ష మీటింగ్‌కు వెళ్లకుండా సైలెంట్‌గా ఉండిపోయారని తెలిపారు. ఇక ఇటీవలి కాలంలో మోదీ విజనరీ అంటూ పొగడటం మెదలు పెట్టాడంతో.. ఒకప్పుడు మోదీని తీవ్రంగా విమర్శించి, ఇప్పుడు ప్రశంసించడంతో బీజేపీ జాతీయ నేతలు ఇప్పటికీ బాబును విశ్వసించేందుకు సిద్ధంగా లేరని పేర్కొన్నారు,
రాష్ట్రంలో ఉండి కూడా ఇంటర్వ్యూలు ఇవ్వొచ్చు
మరోవైపు ఇప్పటికీ బీజేపీతో కలవడానికి ఆరాటపడుతున్న చంద్రబాబును కలుపుకోవడానికి ఇండియా కూటమి రెడీగా లేదని చెప్పారు దీంతో దేశ రాజధానిలో బాబు అరెస్ట్‌పై భారీ స్పందన రావడం లేదని తెలిపారు. జాతీయ మీడియాలో బాబు అరెస్ట్‌ను ఎక్స్‌పోస్ చేయడానికి లోకేష్ ఇన్ని రోజులు ఢిల్లీలో ఉండాల్సిన అవసరం లేదన్నారు. హైదరాబాద్, విజయవాడలో కూర్చొని జాతీయ మీడియాతో ఇంటర్వ్యూల్లో పాల్గొనవచ్చని తెలిపారు. దీనివల్ల లోకేష్ ఢిల్లీలో పెద్దగా పొలిటికల్ యాక్టివిటీ చేసే పరిస్థితి లేదన్నారు.