తెలంగాణ వీణ , హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేయడంపై ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు ఓ వైపు రక్తం చిందిస్తుంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. జాతీయ నాయకత్వంలో ఆయన తమ పార్టీలో చేరారని, ఇప్పుడు నిందలు వేయడం సరికాదన్నారు. రాజగోపాల్ రెడ్డికి జాతీయస్థాయిలో పార్టీ మంచి స్థానం కల్పించిందన్నారు.
నరేంద్ర మోదీ కచ్చితంగా మూడోసారి ప్రధాని అవుతారన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఏం చేసిందో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. బీజేపీ అందరిలోనూ జాతీయ భావాన్ని పెంపొందిస్తుందన్నారు. జనసేన, బీజేపీ కలిసి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు చెప్పారు.