తెలంగాణ వీణ, సిటీబ్యూరో :అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, గృహలక్ష్మి పంపిణీ చేసి తెలంగాణలో గుడిసె లేని మొదటి నియోజవర్గంగా సిరిసిల్లను తీర్చిదిద్దుతానని మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో లబ్ధిదారులకు ఆర్థిక చేయూత, డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను హోంమంత్రి మహమూద్అలీతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘డబుల్ బెడ్ రూం మంజూరు కోసం ఎవరైనా, ఎవరికైనా లంచం ఇచ్చారా అని లబ్ధిదారులను ప్రశ్నించగా.. ఎవ్వరికీ రూపాయి ఇవ్వలేదని, ఎవరూ అడగలేదని లబ్ధిదారులు మంత్రికి చెపపారు. దీంతో ‘ప్రభుత్వ పారదర్శక పాలనకు ఇదే నిదర్శనమని కేటీఆర్అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది, దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని అన్నారు.
ప్రజలే కేంద్ర బిందువుగా, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గంలో గుడిసెలు, ఇండ్లు లేని, శిథిలావస్థలో ఉన్న 1,747 మందిని గుర్తించి గృహలక్ష్మి కింద ఇండ్ల నిర్మాణం కు ఆర్థిక సహాయం అందజేస్తున్నామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, గృహాలక్ష్మి లబ్ధిదారులుపోనూ ఇంకా మిగిలి ఉంటే, సీఎం కేసిఆర్ కాళ్లు మొక్కి అయినా సరే గృహాలక్ష్మి మంజూరు చేస్తానని కేటీఆర్అన్నారు. సిరిసిల్ల పట్టణంలో 2,800 మందిని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేసేందుకు అర్హులను గుర్తించామని, ఇప్పటికే వీరిలో 1,260 మందికి మండేపల్లి, 577 మంది లబ్ధిదారులకు పేద్దూరు, రగుడులలో డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయించి పట్టాలను అందజేస్తామని అన్నారు. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గ ప్రజలకు ప్యాకేజీ-9 కల్పతరువు అని, ఇప్పటికే మల్కపేట రిజర్వాయర్ పనులు పూర్తి చేశామని, వారం రోజుల్లో కేసీఆర్ దీన్ని ప్రారంభిస్తారని అన్నారు. సాగు, తాగు, విద్యుత్, విద్య, వైద్యం రంగాల్లో వచ్చిన సానుకూల మార్పులను ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు.రైతుబంధు తీసుకుంటున్న రైతులు, ఆసరా పింఛన్ పొందుతున్న లబ్ధిదారులు బీఆర్ఎస్ కు ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ గల్లంతవడం ఖాయమని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్అన్నారు. మంగళవారం ధర్మపురిలో హోమ్మినిస్టర్మహమ్మద్ అలీ, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి 50 పడకలతో నిర్మించిన మాతా శిశు ఆసుపత్రి, పైలాన్ తోపాటుగా గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. వెల్గటూర్ లో అగ్రికల్చర్కాలేజీ ఏర్పాటుకు వర్చువల్ గా ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో కేటీఆర్మాట్లాడారు.దేశంలో లేని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు పరుస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అభివర్ణించారు. వర్షాకాలంలో ధర్మపురి పట్టణంలోని పలు వార్డులు గోదావరి నీటితో మునిగిపోతున్నందున అక్కడ కరకట్టలు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణ అభివృద్ధికి, లక్ష్మీ నరసింహ స్వామి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు మున్సిపల్ శాఖ ద్వారా రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మినిస్టర్ఈశ్వర్ మాట్లాడుతూ ధర్మపురి అభివృద్ధి కోసం రూ.247 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలే నా బలం, బలగం, నా ఆశ, నా శ్వాస అని నా జీవితం ప్రజల కోసమే అంకితమని అన్నారు. లక్ష్మీనారసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణం కోసం రూ.100 కోట్లు, అక్కపెల్లి చెరువు అభివృద్ధి కోసం రూ.72 లక్షలు ఖర్చు చేసినట్లు వివరించారు.