తెలంగాణ వీణ ,హైదరాబాద్ :‘ఇప్పుడున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎవ్వడో కాదు.. పక్కా ఆరెస్సెస్ మనిషి’ అని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఆరోపించారు. బీజేపీ అసలుసిసలైన అతివాద సంస్థ మనిషే తెలంగాణ పీసీసీకి చీఫ్‌గా ఉన్నారని తెలిపారు. ఈ విషయం తాను చెప్పట్లేదని, కాంగ్రెస్‌లో ఉండి, సీఎంగా పని చేసి, ఆ పార్టీ తీరునచ్చక రాజీనామా చేసిన పంజాబ్ మాజీ సీఎం అమరీందర్‌సింగ్ రాసిన లేఖలో ఉన్నదని స్పష్టం చేశారు. ఈ మేరకు సోనియాకు అమరీందర్ రాసిన లేఖ ప్రతిని ప్రజల ముందుంచారు. ‘నేను సైన్యంలో పని చేశా. నిబద్ధతతో సేవ చేసిన మీ నిర్ణయాలు బాధ కలిగిస్తున్నాయి అతివాద మనిషిని, ముస్లింలను ద్వేషించే వ్యక్తిని పీసీసీ చీఫ్‌గా పెట్టిండ్రు’ ఆ లేఖలో పేర్కొన్నట్టు వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధ్యక్షుడు బీజేపీ మనిషి అని, గాంధీని చంపిన గాడ్సే ఆరెస్సెస్ మనిషేనని స్పష్టం చేశారు. అలాంటి రేవంత్‌రెడ్డి అమాయక ముస్లింలను రెచ్చగొడుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దని ప్రజలకు హితవు పలికారు. బుధవారం మంత్రి కేటీఆర్ నిర్మల్ నియోజకవర్గంలో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో రూ.753 కోట్లతో చేపట్టిన కాళేశ్వరం ప్యాకేజీ-27ని, పోచంపాడ్ వద్ద రూ.300 కోట్లతో నిర్మించే పామాయిల్ పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రూ.135.15 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పలు ప్రారంభోత్సవాలు చేశారు. రెండు పట్టణాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీపై నిప్పులు చెరిగారు. ఈ ప్రసంగాలు కేటీఆర్ మాటల్లోనే.. ‘ఎన్నికలు అనగానే ప్రధాని మోదీ గాలి మోటర్ల వచ్చిండు. గాలి మాటలు చెప్పిండు. అవతల పడ్డడు. ఆయన వచ్చి బీఆర్‌ఎస్ వాళ్లు, కాంగ్రెసోళ్లు ఒకటే అంటరు.. కాంగ్రెసోళ్లు రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ వచ్చి బీఆర్‌ఎస్‌వాళ్లు, బీజేపీవాళ్లు ఒకటే అంటరు.