తెలంగాణ వీణ, రాష్ట్రీయం : కాళేశ్వరం ప్రాజెక్టుది పిచ్చి తుగ్లక్ డిజైన్ అని, అలాంటి మేడిగడ్డ వద్ద పిల్లర్ కుంగిపోతే ఎవరో కుట్ర చేశారని కేసు పెడతారా? అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ… కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా నిర్మించినట్లు బీఆర్ఎస్ చెబుతోందని, కానీ ఇది ఒక హిస్టారికల్ బ్లండర్ అన్నారు. అదో పిచ్చి తుగ్లక్ డిజైన్ అన్నారు. చేసిన తప్పును తెలుసుకొని సీఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రూ.30వేల కోట్ల ప్రాజెక్టు వ్యయాన్ని రూ.1.30 లక్షల కోట్లకు పెంచారని, అప్పులు చేసి పనికిరాని చెత్త ప్రాజెక్టు నిర్మించారన్నారు. ప్రభుత్వ అసమర్థతతో మేడిగడ్డ పిల్లర్ కుంగిపోయిందని, కానీ ఎవరో కుట్ర చేశారని కేసు నమోదు చేయడం హాస్యాస్పదమన్నారు. ప్రాజెక్టు క్వాలిటీపై న్యాయ విచారణకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. డ్యాం సేఫ్టీ కమిటీ ప్రాజెక్టును పరిశీలిస్తోందని, వారు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర అధికారులు సరైన సమాధానాలు ఇవ్వడం లేదన్నారు. కాళేశ్వరం మీద గప్పాలు పలికిన కేసీఆర్, ఆయన కుటుంబం ఇప్పుడెందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారానికి సంబంధించి పూర్తిస్థాయి దర్యాఫ్తు జరపాలన్నారు. ప్రజల్ని మోసం చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేసు పెట్టాలన్నారు. సూపర్ ఇంజినీర్ అవతారమెత్తిన కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్టు పేరిట కాళేశ్వరం నిర్మించాడన్నారు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టు గుదిబండలా మారిందన్నారు. ఈ ప్రాజెక్టు దెబ్బతింటే లిఫ్ట్ యాక్టివిటీ, మిగతా ప్రాంతాలకు మళ్లించే నీటి వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోతాయన్నారు. మేడిగడ్డ నాణ్యతపై లోపాలు బయటపడటం చూస్తుంటే పూర్తి ప్రాజెక్టు నిర్మాణం అనుమానాలకు తావిస్తోందన్నారు.
భైంసాలో ఉన్నామా, పాకిస్థాన్‌లోనా?
భైంసాలో అరాచకం కనిపిస్తోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. మనం భైంసాలో ఉన్నామా? పాకిస్థాన్‌లో ఉన్నామా? అని నిలదీశారు. అక్కడ పండుగలు కూడా భయంభయంగా చేసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. పదేళ్లలో ఇప్పటి వరకు ఒక్కరికీ రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక దేశవ్యాప్తంగా ఎరువుల కొరత లేదని, కరెంట్ కోతలు లేవన్నారు.