తెలంగాణ వీణ, జాతీయం : జీవితంలో ఏదైనా సాధించాలన్న పట్టుదల ఉంటే సరిపోదు.. అందుకు తగ్గ కృషి కూడా ఉంటేనే మనం అనుకున్నది వందశాతం నెరవేర్చుకోగలం. అందుకు నిదర్శనం కేరళకు చెందిన ఓ కుర్రాడు . తన పట్టుదల, కృషితో రూ.లక్షలు విలువ చేసే మారుతి 800 కారును రూ.కోట్లు విలువ చేసే రోల్స్ రాయిస్ లుక్‌లోకి మార్చేశాడు.
కేరళకు చెందిన 18 ఏళ్ల హదీఫ్ కు కార్లంటే పిచ్చి. అందులోనూ ఖరీదైన కార్లంటే చాలా ఇష్టం. ఒక్కసారైనా లగ్జరీ కారులో తిరగాలని కలలు కనేవాడు. అయితే, వాటిని కొనుగోలు చేసే స్తోమత హదీఫ్ కుటుంబానికి లేదు. అలాగని నిరాశపడకుండా తన ఆలోచనలకు పదునుపెట్టాడు. తన వద్ద ఉన్న చిన్న మారుతి 800 కారును లగ్జరీ కారుగా మార్చాలని సంకల్పించాడు. ఇందుకోసం నెలల తరబడి కష్టపడి పాత రోల్స్ రాయిస్ కార్ల విడిభాగాలను సేకరించాడు. ఆ విడిభాగాలను వెల్డింగ్ చేసి ఓ రూపానికి తీసుకొచ్చాడు. అలా ఆ విడిభాగాలను మారుతి 800 కారుకు అమర్చి రోల్స్ రాయిస్‌గా మార్చేశాడు. ఈ కారు చూస్తే నిజంగానే ఇది రోల్స్ రాయిస్ కారేనేమో అని అనుకోవాల్సిందే. అయితే, ఇదంతా చేయడానికి అతడు కేవలం రూ.45 వేలు మాత్రమే ఖర్చు చేయడం విశేషం.
ఇప్పుడు ఆ కారులో ఎంతో దర్జాగా చక్కర్లు కొడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను హదీఫ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు హదీఫ్ పట్టుదల, కృషిని కొనియాడుతున్నారు.