తెలంగాణ వీణ , హైదరాబాద్ : ‘ప్రదానమంత్రి నరేంద్ర మోదీ పచ్చి అబద్ధాలకోరు. బీజేపీ జుమ్లా, జూటా పార్టీ ఆఫ్ ఇండియా. ఆ పార్టీ ఒక వాట్సాప్ యూనివర్సిటీ. దానికి చాన్స్‌లర్ ఆయన. కథలు చెప్పడంలో ఆరితేరిన ప్రధాని సినిమా కథలు రాసేందుకు ప్రయత్నించాలి. ఆయన నటనకు తప్పకుండా ఆస్కార్ అవార్డు వస్తుంది. ముఖ్యమంత్రితో జరిగిన అధికారిక సమావేశాలను నీచమైన రాజకీయాలకు వాడుతున్న మోదీ.. ప్రధాని పదవి స్థాయిని దిగజార్చేలా మాట్లాడుతున్నారు. నన్ను ఆశీర్వదించాలని మోదీని కేసీఆర్ కోరారట! నేను సీఎం కావడానికి ఆయన అనుమతి తీసుకోవాలా? మా పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి కావాలో నిర్ణయించేది ప్రధాని కాదు.. మా పార్టీ ఎమ్మెల్యేలనే విషయం కూడా ఆయనకు తెలియదు.బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మునిగిపోతున్న నావ. మునిగే నావను ఎక్కాలని ఎవరూ అనుకోరు. ఎన్డీయేలో చేరేందుకు మాకేమైనా పిచ్చి కుక్క కరిచిందా? శివసేనతో సహా ఇప్పటికే ఎన్నో పార్టీలు ఎన్డీయే కూటమి నుంచి బయటికి వచ్చాయి. ఆ పార్టీలో ఉన్నవి ప్రస్తుతం ఈడీ, సీబీఐ, ఐటీ మాత్రమే. సీఎం కేసీఆర్ ఒక ఫైటర్. నరేంద్ర మోదీ లాంటి చీటర్‌తో ఆయన కలిసి పనిచేయరు..’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు. మంగళవారం బంజారాహిల్స్‌లోని వీవ్స్ అండ్ క్రాఫ్ట్స్ భవనం ప్రారంభోత్సవానికి విచ్చేసిన కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.