తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణకు అనుకూలంగా 2007లోనే బీజేపీ తీర్మానం చేసిందని, 2014లో తెలంగాణ బిల్లును ఆమోదింపజేసిన ఘనత తమ పార్టీదేనని బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఆ సమయంలో రాజ్ నాథ్ సింగ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారన్నారు. సోమవారం జమ్మికుంటలో నిర్వహించిన బీజేపీ జనగర్జన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశాభివృద్ధికి చిన్న రాష్ట్రాల ఏర్పాటు సరైనదని తీర్మానం చేసింది జనసంఘ్ అన్నారు. తెలంగాణ ఏర్పాటు చేయాలని రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్‌లు కోరినట్లు చెప్పారు.
నాడు కమలాపురం ఓటర్లు ఏ రాజకీయ నేపథ్యం లేని తనను 25వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారని గుర్తు చేసుకున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశానన్నారు. తాను మంత్రినయ్యాక హాస్టల్‌కు సన్నబియ్యం ఇచ్చినట్లు చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆసుపత్రుల్లో వసతులు పెంచానన్నారు. గత ఉప ఎన్నికల్లో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తనను ఓడించేందుకు కేసీఆర్ అనేక కుట్రలు చేశారన్నారు. కానీ ప్రజల గుండెల్లో స్థానం ఉన్న తనలాంటి వ్యక్తిని ఓడించగలరా? అన్నారు. బీఆర్ఎస్ అప్పుడు వందల కోట్లు ఖర్చు పెట్టినా తానే గెలిచానన్నారు. ఇప్పుడు ప్రజలకు ఏ పథకం కావాలన్నా బీఆర్ఎస్‌లోకి రమ్మని చెబుతున్నారని విమర్శించారు.
తాను మందు ఇచ్చేస్థాయిలో లేకపోవచ్చు… సూదిచ్చేస్థాయిలో లేకపోవచ్చు… కానీ ధైర్యాన్ని ఇచ్చే స్థాయిలో ఉన్నానని కరోనా సమయంలో చెప్పానని, అన్నట్లుగానే గాంధీ ఆసుపత్రికి వెళ్లి మొట్టమొదటి కరోనా పేషెంట్ భుజం తట్టి ధైర్యం చెప్పానని గుర్తు చేశారు. కరోనా సమయంలో గ్రామాలకు గ్రామాలు ఏ ఊరికి ఆ ఊరివాళ్లు, ఏ ఇంటి వాళ్లు ఆ ఇంటికి కంప వేసుకున్నారని, అలాంటి సమయంలో గాంధీ ఆసుపత్రి, చెస్ట్ ఆసుపత్రికి తిరిగిన వ్యక్తిని తానే అన్నారు.
2015లో మున్సిపల్ కార్మికులు వేతనాలు పెంచమని సమ్మె చేస్తే నాడు కేసీఆర్ 1700 మంది కార్మికులను డిస్మిస్ చేసినట్లు చెప్పారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా? అని ఆ రోజే తాను కేసీఆర్‌ను అడిగానని, వాళ్లు నోరులేని కార్మికులు అని, వాళ్లను డిస్మిస్ చేయవద్దని అడిగిన వ్యక్తిని తానే అన్నారు.