తెలంగాణ వీణ ,హైదరాబాద్ : సీఎం కేసీఆర్ త్వరలోనే పింఛన్లు పెంచే ప్రకటన చేస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని హయగ్రీవాచారి మైదానంలో బీఆర్ఎస్ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ‘‘ఎన్నికలు వస్తున్నాయని.. సంక్రాంతికి గంగిరెద్దులోళ్లు వచ్చినట్టు విపక్షాలు వస్తాయి. హైదరాబాద్ సంస్థానాన్ని ఆంధ్రాలో కలిపిందే కాంగ్రెస్. తెలంగాణపై ప్రధాని నరేంద్రమోదీ విషం చిమ్ముతున్నారు. తెలంగాణ ఇస్తే ఇక్కడ సంబరాలు జరగలేదని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ నేతలకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా. మేము బస్సులు ఏర్పాటు చేస్తాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించండి. కరెంటు తీగలు పట్టుకోండి. కరెంటు ఉందోలేదో తెలుస్తాది. దరిద్రం పోతాది. తెలంగాణ ఉద్యమం జరుగుతన్నప్పుడు అమెరికా పారిపోయిన కిషన్ రెడ్డి ఇవాళ బీజేపీ అధ్యక్షుడు అయ్యారు. మోదీ దేవుడని బండి సంజయ్ అంటున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినందుకు దేవుడా…?, తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదింది వరంగల్. వరంగల్ వాళ్లు ఆగట్టునుంటారా..?, ఆగట్టునుంటారా…? తేల్చుకోవాలి. వినయ్ భాస్కర్‌కు మరోసారి ఓటేసి గెలిపించండి.’’ అని కేటీఆర్ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.