తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : గత 70ఏళ్లలో ఏపీ చరిత్రలో ఇన్ని ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ఒకేసారి ఎప్పుడూ జరగలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చొరవ తీసుకుని తీర ప్రాంతంపై దృష్టి పెట్టారు. తీరం వెంబడి కార్యకలాపాలు చేపడితే ఏపీలో గ్రోత్ పరుగులు పెట్టే అవకాశం ఉంది. ఇన్నేళ్లుగా ఏపీకి 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నా, తగు అభివృద్ది జరగడం లేదని రాసేవారం. ఇప్పుడు మారిటైమ్ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలతో ఆ పరిస్థితి మారుతోంది. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్ వే పోర్టుల నిర్మాణం చేపట్టారు.
కాకినాడ పోర్టు తప్ప మిగిలిన వాటిని ప్రైవేటు రంగంలో సిద్దం చేస్తున్నారు. వారు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నట్లు కనిపించింది. బందరు పోర్టు నిర్మాణం కూడా చురుకుగా సాగుతోంది. కాకినాడ పోర్టు పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంలో చేపట్టారు. కొత్త ఓడరేవులకు అనుసంధానంగా పరిశ్రమలకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటివల్ల లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. కొద్ది రోజుల క్రితం రామాయపట్నం ఓడరేవు నిర్మాణాన్ని, అలాగే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులను పరిశీలించడానికి నేను వెళ్లాను. ఫిషింగ్ హార్బర్ 95 శాతం పూర్తి అయిందని అధికారవర్గాలు తెలిపాయి.