తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : మచిలీపట్నంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి అనేక సమస్యలు వచ్చి చేరాయి. జనసేన అధినేతను కలిసిన విద్యుత్ మీటర్ రీడర్లు.. పని భారం పెంచి పొమ్మనకుండా పొగ పెడుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. జగన్ అధికారం కోసం ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చారన్నారు. పాదయాత్రలో నోటికి ఏదొస్తే అది వాగ్ధానం చేశారని.. ఇప్పుడు అమలు చేయకుండా అందరినీ మోసం చేశారని విమర్శించారు. క్లాస్ వార్ అని మాట్లాడే జగన్ అసలు ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. నిజంగా క్లాస్ వార్ చేస్తుంది జగనే అని అన్నారు. పేదలకు అండగా ఉండకుండా మాలటతో మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలకు భారం తప్ప, ప్రయోజనం లేదన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసే బాధ్యతను జనసేన తీసుకుంటుందని తెలిపారు. ‘‘మీకు న్యాయం జరిగేలా నా వంతు కృషి చేస్తా’’ అంటూ పవన్ హామీ ఇచ్చారు.