తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : మాజీ సీఎం చంద్రబాబు నిజాయితీపరుడే అయితే కోర్టు పర్యవేక్షణలో మీ ఆస్తులపై విచారణకు సిద్ధమా? అని నారా లోకేశ్‌కు మాజీ మంత్రి పేర్ని నాని(వెంకట్రామయ్య) సవాల్ విసిరారు. చంద్రబాబు నిజాయితీపరుడంటూ ఆయన కుటుంబం చెబుతున్న సొల్లు కబుర్లను కట్టిపెట్టాలన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. గంధపు చెక్కల దొంగ వీరప్పన్ తాను అడవులను సంరక్షిస్తున్నానంటూ నమ్మబలికినట్లుగానే ఖజానాకు కన్నం వేసి తాను ప్రజల కోసం పని చేస్తున్నానంటూ చంద్రబాబు ఇన్నాళ్లూ నీతులు వల్లించారన్నారు.
స్కిల్ స్కామ్‌లో అడ్డంగా దొరికిపోయిన దొంగ చంద్రబాబును కోర్టు రిమాండ్‌పై జైలుకు పంపితే తల్లిని, భార్యను రాజమండ్రిలో రోడ్ల మీద వదిలేసి ఢిల్లీకి ఎందుకు పరిగెత్తావని లోకేశ్‌ను ప్రశ్నించారు. తండ్రిని రక్షించుకోవడానికి ఎవరి కాళ్లు పట్టుకోవడానికి ఢిల్లీకి వెళ్లావని నిలదీశారు. దేశంలో వ్యవస్థలను మేనేజ్ చేయడంలో మొనగాడు ఎవరని లోకేశ్ ఆయన డ్రైవర్‌ను అడిగినా చంద్రబాబు పేరే చెబుతారన్నారు. సీమెన్స్ ఇస్తుందని మీరు చెప్పిన రూ.3 వేల కోట్లు ఎక్కడికి వెళ్లాయో చెప్పాలన్నారు. ఖజానా నుంచి కాజేసిన రూ.371 కోట్లలో రూ.27 కోట్లు సిగ్గు లేకుండా టీడీపీ ఖాతాలో వేసుకున్నారని ధ్వజమెత్తారు.
పెడన సభలో ఎన్డీఏ నుంచి బయటకొచ్చానని ప్రకటించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముదినేపల్లికి వచ్చేసరికి మాట మార్చారని పేర్ని నాని గుర్తు చేశారు. ‘నువ్వు ఎన్డీఏలోనే కొనసాగుతుంటే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇచ్చావ్? తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో సంప్రదించకుండా ఏకపక్షంగా 32 సీట్లలో పోటీ చేస్తున్నామని, గ్లాస్ గుర్తు కేటాయించాలని ఎన్నికల సంఘాన్ని ఎందుకు కోరావ్?’ అని పవన్‌ను నిలదీశారు. తెలంగాణలో మున్నూరు కాపులు ఉన్న చోటే ఎందుకు పోటీ చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సూచించిన మేరకే ఆ స్థానాల్లో పోటీ చేస్తున్నావా? అని నిలదీశారు.