తెలంగాణ వీణ , క్రీడలు : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో అధునాతన సౌకర్యాలతో మల్టిపర్పస్ ఇండోర్ స్టేడియం అందుబాటులోకి వచ్చింది. శనివారం క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్టేడియాన్ని ప్రారంభించారు. ప్రధాన స్టేడియం ఆవరణలో రూ.9.10 కోట్లతో ఈ మల్టిపర్పస్ స్టేడియాన్ని ప్రభుత్వం నిర్మించింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘ప్రతి నియోజకవర్గంలో స్టేడియాలు, ప్రతి పల్లెలో క్రీడాప్రాంగణాలు నిర్మించాం.
గతంలో పాలమూరులో పేరుకే స్టేడియం ఉండేది. కానీ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా 50 కోట్లతో ప్రధాన స్టేడియం ఆధునీకరణతో పాటు మల్టిపర్పస్ ఇండోర్ స్టేడియం, ఎంవీఎస్ డిగ్రీ కాలేజీ ఆవరణలో ఇండోర్ స్టేడియం నిర్మించాం. దేశంలో ఎక్కడా లేని స్టేడియాలను నిర్మిస్తున్నాం. వాలీబాల్ అకాడమీని ఇక్కడికి తీసుకొచ్చాం, త్వరలో సింథటిక్ ట్రాక్ నిర్మిస్తాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ షట్లర్ గుత్తా జ్వాల, జెడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, కలెక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు.