తెలంగాణ వీణ , జాతీయం : పాలస్తీనా హమా్‌సతో యుద్ధంలో తలమునకలైన ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం దాదాపు 18 వేల మంది భారతీయులు ఉన్నారు. వీరిలో విద్యార్థులు, ఉద్యోగులతోపాటు ఆ దేశ పర్యటనకు వెళ్లిన టూరిస్టులు, వ్యాపార పనుల మీద వెళ్లిన వారు కూడా ఉన్నారు. వీరందరూ సురక్షితంగానే ఉన్నారని తెలుస్తోంది. వీరి క్షేమ సమాచారాన్ని అటు ఇజ్రాయెల్, ఇటు పాలస్తీనాలోని భారత దౌత్య కార్యాలయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన వారిలో రాజ్యసభ ఎంపీ డాక్టర్ వాన్‌వెయిరొయ్ ఖార్లుఖితోపాటు ఆయన భార్య, కుమార్తె కూడా ఉన్నారు. ఖార్లుఖి మేఘాలయకు చెందిన నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన ఎంపీ. జెరూసలేం యాత్ర కోసం ఎంపీ, ఆయన కుటుంబంతోపాటు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన మరో 24 మంది కూడా ఇజ్రాయెల్‌కు వెళ్లారు. ప్రస్తుతం బెత్లెహాంలో చిక్కుకుపోయిన వీరిని సురక్షితంగా స్వదేశానికి రప్పించటానికి మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా భారత విదేశాంగశాఖతో సంప్రదింపుల్లో ఉన్నారు. మరోవైపు, ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన నటి నుస్రత్ బరూచా ఆదివారం సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇజ్రాయెల్‌లో జరిగిన హైఫా అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో పాల్గొనటానికి ఆమె అక్కడికి వెళ్లారు. ఇదిలా ఉండగా, హమా్‌సతో జరుగుతున్న యుద్ధంలో తమకు మద్దతు ఇచ్చినందుకు భారత్‌కు ఇజ్రాయెల్ కృతజ్ఞతలు తెలిపింది.