తెలంగాణ వీణ , జాతీయం : ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో చిక్కుకుపోయిన 447 మంది భారతీయులను ‘ఆపరేషన్ అజయ్’ కింద తిరిగి తీసుకువచ్చేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అవుతున్నాయి. 212 మందితో టెల్ అవీవ్ లోని బెన్ గురియన్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయల్దేరిన ప్రత్యేక విమానం ఆరు గంటల ప్రయాణం తర్వాత శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీకి చేరుకుంది. తాజాగా 235 మంది ప్రయాణికులతో వచ్చిన రెండో విమానం శనివారం ఢిల్లీలో సేఫ్ గా ల్యాండ్ అయింది. ఈ సందర్భంగా ప్రయాణికులు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వారిని స్వదేశానికి సేఫ్ గా తీసుకురావడంపై విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ హర్షం వ్యక్తం చేశారు.
ఢిల్లీ విమానాశ్రయంలో భారతీయ పౌరులకు స్వాగతం పలికిన విదేశాంగ శాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్ రంజన్ సింగ్ ఈ ఆపరేషన్ కొనసాగుతుందని వెల్లడించారు. “ఆపరేషన్ అజయ్ కొనసాగిస్తాం. ఇజ్రాయెల్‌లో దాదాపు 18 వేల మంది భారతీయ పౌరులు నివసిస్తున్నారు. తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నవారికి సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నిస్తున్నాం” అని వెల్లడించారు.