బీజేపీని వదులుకుంటే అన్నాడీఎంకేకు పుట్టగతులుండవని, రాబోయే రోజుల్లో రెండాకుల గుర్తు కూడా కనుమరుగవుతుందని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ అభిప్రాయపడ్డారు. సోమవారం మాజీ ముఖ్యమంత్రి కామరాజ్ వర్ధంతిని పురస్కరిచుకుని మదురైలో జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి నివాళి అర్పించిన దినకరన్.. విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించిన 500కు పైగా హామీలలో 90 శాతం కూడా అమలు చేయలేదని, శాంతి భద్రతలు క్షీణించాయని, ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, జమిలి ఎన్నికలు జరిగితే డీఎంకే చిత్తుగా ఓడిపోతుందన్నారు. బీజేపీ, ఎన్డీఏ కూటమిని వదులుకుంటే అన్నాడీఎంకే కూడా పత్తాలేకుండా పోతుందన్నారు. ఇక ఎడప్పాడి పళనిస్వామి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సమయంలో అవకతవకలకు పాల్పడిన కారణం వల్లే డీఎంకే అధికారంలోకి వచ్చిందని దినకరన్ విమర్శించారు.