తెలంగాణ వీణ,సినిమా : సినీరంగంలోనే స్థిరపడాలనే తలంపుతో ఓ యువ ఐఏఎస్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అభిషేక్ సింగ్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని అధికారులు కూడా ధ్రువీకరించారు. నటన, మోడలింగ్‌పై అభిషేక్ సింగ్‌కు విపరీతమైన అనురక్తి. ఇప్పటికే పలు సినిమాల్లో ఆయన నటించారు. అంతేకాదు, ఇన్‌స్టాగ్రాంలో ఆయనకు 50 లక్షల మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు. అభిషేక్ అర్ధాంగి శక్తి నాగ్‌పాల్ కూడా ఐఏఎస్ అధికారే, కాగా, సర్వీసులో ఉండగా అభిషేక్ సింగ్ పలు వివాదాలను ఎదుర్కొన్నారు. 2015లో యూపీ నుంచి ఢిల్లీకి మూడేళ్ల డిప్యుటేషన్‌పై వెళ్లగా ఉన్నతాధికారులు ఆ తరువాత దీన్ని మరో రెండేళ్లకు పొడిగించారు. ఆ సందర్భంలో అభిషేక్ కొంతకాలం పాటు మెడికల్ లీవ్ తీసుకోవడంతో ప్రభుత్వం ఆయనను 2020లో సొంత రాష్ట్రానికి పంపించింది. అయినా, విధులకు సరైనా కారణం లేకుండానే దూరంగా ఉన్న ఆయన మూడు నెలలు ఆలస్యంగా విధుల్లో చేరారు. గతేడాది అభిషేక్ సింగ్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకుడిగా వెళ్లారు. ఆ సందర్భంలో తనే ఎన్నికల పరిశీలకుడినన్న విషయం అందరికీ తెలిసేలా ఇన్‌స్టాలో ఆయన ఓ ఫొటో పోస్ట్ చేయడం వివాదాస్పదంగా మారింది. ఫలితంగా ఈసీ ఆయనను విధుల నుంచి తప్పించింది. ఏకంగా ఏడాది పాటు సస్పెండ్ చేసింది. ఈ వరుస పరిణామాల నేపథ్యంలో ఆయన తాజాగా ఉద్యోగానికే రాజీనామా చేసేశారు.