తెలంగాణ వీణ , పాలిటిక్స్ : ఓట్ల కోసం మాటలు చెప్పి వెళ్లిపోయే నాయకుడిని కాదు, నేను మీ వాడిని.. ఎలాంటి ఆపద వచ్చిన ఆదుకోవడానికి అండగా ఉంటానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బన్సీలాల్‌పేట్ డివిజన్‌లో రూ.1.52 కోట్లతో హమాలీబస్తీ, భోలక్‌పూర్, బోయిగూడ, ఐడీహెచ్ కాలనీ, ముస్లిం బస్తీలలో పలు అభివృద్ధి పనులను కార్పొరేటర్ హేమలతతో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. పద్మారావునగర్‌లోని హమాలీబస్తీలో స్థానికులు సహకరిస్తే ఇండ్లు నిర్మించడానికి సర్కారు సిద్ధంగా ఉన్నదని ఆయన అన్నారు. స్వయంగా సీఎం కేసీఆర్ హమాలీబస్తీని సందర్శించారని, పేదల ఇబ్బందులను చూసి చలించిపోయారని, సకల సదుపాయాలతో కూడిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి నిధులను కూడా వెంటనే మంజూరు చేశారని తెలిపారు. అనంతరం బోయిగూడలోని ఐడీహెచ్ కాలనీలో స్థానికులతో ఆయన మాట్లాడుతూ తెలంగాణాలోనే తొలిసారిగా సీఎం కేసీఆర్ నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కాలనీ అందరికీ ఆదర్శంగా మారిందన్నారు. పాత బ్లాక్ నెంబర్లు 4,5,6,10 భవనాల మరమ్మతులను ప్రభుత్వం చేపడుతుందని, మిగిలిన అందరికీ పట్టాలను కూడా ఇస్తామని తెలిపారు. పలు బస్తీలలో తాను సొంత ఖర్చులతో 50 ఆలయాలను నిర్మిస్తున్నానని తెలిపారు. మాజీ కార్పొరేటర్ ఏసూరి సావిత్రి, డివిజన్ ఇంచార్జి పవన్ కుమార్ గౌడ్, బీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడు వెంకటేశన్ రాజు, కార్యదర్శి రాజేందర్, ఏసూరి మహేశ్, లక్ష్మీపతి పాల్గొన్నారు.
అర్హులైన వారందరికీ దశల వారీగా డబుల్ బెడ్‌రూం ఇండ్లను పంపిణీ చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. సోమవారం రాంగోపాల్‌పేట్ డివిజన్ కాచ్‌బౌలిలో రూ. 55 లక్షలతో చేపట్టనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బస్తీ వాసుల సౌకర్యార్థం కమ్యూనిటీ హాల్‌ను నిర్మిస్తున్నట్టు తెలిపారు. బస్తీ వాసులు చిన్న చిన్న ఫంక్షన్‌లను జరుపుకోవాలన్నా, సమావేశాలు నిర్వహించుకోవడానికి ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. ఇప్పటి వరకు లక్ష ఇండ్లను నిర్మించగా అందులో 70 వేల వరకు పంపిణీ చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అరుణగౌడ్, డీసీ శంకర్, ఈఈ సుదర్శన్, జలమండలి సీజీఎం ప్రభు, పాల్గొన్నారు.
రూ. 1400 కోట్లతో సనత్‌నగర్ అభివృద్ధి
గత పాలకుల నిర్లక్ష్యాన్ని సరిదిద్దుతూ ప్రజలకు మెరుగైన వసతుల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలో రూ. 1400 నిధులతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. సోమవారం సనత్‌నగర్, అమీర్‌పేట్ డివిజన్లలో పలు ప్రాంతాల్లో తాగునీటి, డ్రైనేజీ పైపులైన్ల నిర్మాణాల కోసం రూ. 1.30 కోట్ల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులకు మంత్రి తలసాని కార్పొరేటర్ కొలను లక్ష్మిరెడ్డి, మాజీ కార్పొరేటర్ శేషుకుమారిలతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇండోర్ స్టేడియాలు, తాగునీటి రిజర్వాయర్లు, హైటెన్షన్ విద్యుత్ తీగలను భూగర్భ కేబుల్ వ్యవస్థతో మార్పు చేయడం, వైట్ ట్యాపింగ్ రోడ్లు, మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాళ్లు, సాధారణ కమ్యూనిటీ హాళ్లు, డ్రైనేజీ, మంచినీటి వ్యవస్థల ఆధునీకరణ, ఎక్కడికక్కడ సీసీ రోడ్ల నిర్మాణాలు, గ్రంథాలయాలు, పాఠశాలలు, క్రీడా ప్రాంగణాల వంటి అనేక పనులను చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ జగన్, డీప్యూటీ ఈఈ మోహన్, ఏఈ సందీప్, జలమండలి జీఎం హరిశంకర్, డీజీఎం వంశీకృష్ణ తది తరులు పాల్గొన్నారు.