తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అరెస్టు చేశారంటూ ఆ పార్టీ నేతలు, ఎల్లో మీడియా చేస్తున్న ఆరోపణలను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొట్టి పారేశారు. చంద్రబాబుపై తనకు ఎలాంటి కక్ష లేదని స్పష్టం చేశారు. కక్ష సాధింపుతో ఆయన్ను ఎవరూ అరెస్టు చేయలేదని తేల్చి చెప్పారు. తాను దేశంలో లేనప్పుడు, లండన్‌లో ఉన్న సమయంలో పోలీసులు చంద్రబాబును అరెస్టు చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై సోమవారం జరిగిన వైఎస్సార్‌సీపీ ప్రతినిధుల సభలో సీఎం జగన్ మాట్లాడారు.
చంద్రబాబుపై విచారణ చేయకూడదట! ఆధారాలు లభించినా అరెస్టు చేయకూడదట! విచారించినతర్వాత కోర్టు రిమాండుకు పంపినా ఒక చంద్రబాబునుగానీ ఒక వీరప్పన్‌నుగానీ ఎవరూ పట్టించి ఇవ్వడానికి వీల్లేదనే తరహాలో ఎల్లో మీడియా, ఎల్లో గజదొంగల ముఠా వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థలతో మనం యుద్ధం చేస్తున్నాం.
చంద్రబాబును సమర్థించడం అంటే.. పేద సామాజిక వర్గాలను వ్యతిరేకించడమే అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లండి. చంద్రబాబును సమర్థించడమంటే పేదవాళ్లకు వ్యతిరేకంగా ఉండటమే! పెత్తదారీ వ్యవస్థను, నయా జమీందారీ వ్యవస్థను సమర్థించడమే. పేద వర్గాల పిల్లలకు ఇంగ్లిషు మీడియం చదువులను వ్యతిరేకించడమే.
చంద్రబాబును సమర్థించడమంటే నిరుపేద అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలిస్తే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుందంటూ వారు కోర్టుల్లో వేసిన దావాలను సమర్థించడమే. చంద్రబాబును సమర్థించడమంటే కొన్ని వర్గాలు ఎప్పటికీ పేదలుగా, కూలీలుగా మిగిలిపోవాలని సమర్థించినట్లే. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? బీసీల తోకలు కత్తిరిస్తానన్న పెత్తందారీ భావజాలాన్ని సమర్థించడమేనని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి.