తెలంగాణ వీణ, సినిమా : నానిప్రధాన పాత్రలో నటించిన ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘హాయ్ నాన్న’. శౌర్యువ్ దర్శకుడు. తండ్రీ-కుమార్తెల సెంటిమెంట్‌తో సిద్ధమైన ఈ చిత్రం డిసెంబర్ 7న విడుదల కానుంది. ఆదివారం ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో వేడుకగా సాగింది. ఇందులో నాని పాల్గొన్నారు. తన గత చిత్రాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మొదట అనుకున్న విధంగా డిసెంబర్ 21 లేదా 22వ తేదీన కాకుండా ‘హాయ్ నాన్న’ను ముందుగానే విడుదల చేయడానికి కారణాన్ని తెలియజేశారు.‘‘పెళ్లి కాకముందు నుంచి ఒక ఆడపిల్లకు తండ్రిని కావాలని ఎన్నో కలలు కన్నాను. ‘హాయ్ నాన్న’తో నా కలలో జీవించే అవకాశం దొరికింది. ఈ సినిమాతో నేను కూడా ఒక ఆడపిల్ల తండ్రిననే అనుభూతిని పొందాను అని నాని అన్నారు. అనంతరం ఆయన విలేకర్లు అడిగిన ప్రశ్న – మీరు ‘జెర్సీ’, ‘శ్యామ్ సింగరాయ్’ వంటి మంచి సినిమాలు చేసినప్పటికీ.. నిర్మాతలకు అనుకున్నంత డబ్బులు రావడం లేదని టాక్? అని అడగగా.. నాని సమాధానాలు చెబుతూ ఈ మాట ఏ నిర్మాతలు చెప్పారో చెప్పండి. నా వద్ద నంబర్స్ ఉన్నాయి. గత చిత్రాల కలెక్షన్స్ గురించి మాట్లాడటానికి ఇది సరైన వేదిక కాదనుకుంటున్నా. థియేరిటికల్, నాన్ థియేరిటికల్, రీమేక్.. ఇలా అన్నివిధాలుగా ఆ సినిమా మంచిగానే వసూళ్లు అందుకుంది. ‘జెర్సీ’ని ఉదాహరణగా చూపించడం తప్పు. కావాలంటే.. ‘అంటే సుందారానికీ’ని ఉదాహరణగా చెప్పొచ్చు. తెలిసీ తెలియని వాళ్లు సోషల్ మీడియాలో ఇలాంటి మాటలు అనొచ్చు కానీ.. అన్నీ తెలిసిన విలేకర్లు ఇలా మాట్లాడటం సరికాదు అని అన్నారు.
ఈ విషయంపై ‘జెర్సీ’ నిర్మాత నాగవంశీ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో నిర్మించిన లాభదాయకమైన చిత్రాల్లో ‘జెర్సీ’ ఒకటి. ఆ సినిమా మాకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఎనలేని గౌరవాన్ని అందించింది. క్రియేటివ్, ఆర్థిక పరంగా ఒక నిర్మాతగా నేను ఈ సినిమా విషయంలో ఆనందంగా ఉన్నా’’ అని ఆయన ట్వీట్ చేశారు.