తెలంగాణ వీణ , జాతీయం : ఎలాంటి కవ్వింపులు లేవు. ఇజ్రాయెల్ దాడులు చేసింది లేదు. మరి పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు ఎందుకని మూకుమ్మడిగా ఇజ్రాయెల్ పై విరుచుకుపడ్డారు? అది కూడా ఎన్నడూ లేని విధంగా వేలాది క్షిపణులతో, భూమి, సముద్ర మార్గాల ద్వారా ఇజ్రాయెల్ లోకి చొరబడి కనిపించిన వారిని అంతమొందించడం వంటి క్రూరమైన దాడికి హమాస్ దిగడం, ఇజ్రాయెల్ తోపాటు. ప్రపంచదేశాలు నివ్వెరపోయేలా చేసింది. నిజానికి పాలస్తీనా ఐక్యరాజ్యసమితి గుర్తించిన ప్రత్యేక దేశంగా లేదు. వారికంటూ సరిహద్దులతో కూడిన ప్రత్యేక దేశం డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కానీ, ఇప్పుడు హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పై దాడికి దిగడం వెనుక ఆంతర్యం ఏంటి..?
ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ అమెరికాకు వచ్చిన సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో జోబైడెన్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘‘ఇజ్రాయెల్ తో ప్రాంతీయ అనుసంధానతకు సంబంధించిన ప్రాజెక్టులో మేము పురోగతి సాధించడం వల్లే హమాస్ మిలిటెంట్లు దాడికి దిగారన్న కారణంతో నేను ఏకీభవిస్తున్నాను’’ అని బైడెన్ తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు.. చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. ఇది కార్యరూపం దాలిస్తే భారత్, ఇజ్రాయెల్, యూరప్ దేశాలకు మరింత మేలు చేయనుంది. ఇజ్రాయెల్ కు – గల్ఫ్ దేశాలకు మధ్య దూరం పెంచడం ద్వారా, ప్రాజెక్టును దెబ్బకొట్టాలన్న వ్యూహం కూడా హమాస్ దాడుల వెనుక ఉందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.