తెలంగాణ వీణ, జాతీయం : ఉగ్రవాద సంస్థ హమాస్ దాడులతో ఇజ్రాయ్‌ల్ ప్రస్తుతం అతలాకుతలమవుతోంది. ఈ ఆకస్మిక దాడులలో చిక్కుకున్న భారతీయులు తమ భద్రతపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే తాము క్షేమంగానే ఉన్నామని, భారతీయ ఎంబసీతో నిత్యం టచ్‌లో ఉంటున్నామని పలువురు భారతీయ విద్యార్థులు తెలిపారు. శనివారం ఉదయం 6.30 గంటలకు పాలస్తీనా ఉగ్రసంస్థ హమాస్ అకస్మాత్తుగా ఇజ్రాయెల్‌పై దాడులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ‘‘నాకు చాలా టెన్షన్‌గా ఉంది. భయంతో వణికిపోతున్నా. అదృష్టవశాత్తూ మాకు తలదాచుకునేందుకు ఓ సురక్షిత ప్రదేశం లభించింది. ఇజ్రాయెల్ పోలీసు దళాలు సమీపంలోనే పహారా కాస్తున్నాయి. ఇప్పటిదాకా మాకు ఎలాంటి హానీ జరగలేదు. మేమంతా క్షేమంగానే ఉన్నాం. చుట్టుపక్కల ప్రాంతాల్లో భారతీయులు మాకు అండగా నిలిచారు. భారతీయ ఎంబసీ వర్గాలతో నిత్యం టచ్‌లో ఉంటున్నాం’ అని గోకు మనవాలన్ అనే భారతీయ విద్యార్థి మీడియాకు అక్కడి పరిస్థితిని వివరించారు. చాలా తీవ్రమైన దాడులు జరిగాయని మరో భారతీయ విద్యార్థి విమల్ కృష్ణస్వామి పేర్కొన్నారు. ఈ దాడులు తమను భయభ్రాంతులకు గురిచేశాయన్నాడు. ఇండియన్ ఎంబసీ అధికారులు తమతో టచ్‌లో ఉన్నారని తెలిపాడు. నిత్యం తమపై ఓ కన్నేసి ఉంచారని చెప్పుకొచ్చాడు. దాడులు ప్రారంభం కావడంతో ఉదయం 5.30కే సైరెన్లు మోగాయని మరో స్టూడెంట్ ఆదిత్య కరుణానిధి నివేదిత తెలిపారు. ఆ తరువాత తాము సుమారు ఎనిమిది గంటల పాటు బంకర్లలో తలదాచుకున్నామని చెప్పారు. హమాస్ ఆకస్మిక దాడులతో శనివారం ఇజ్రాయెల్ కంపించిపోయింది. ఒకేసారి హామాస్ ఉగ్రసంస్థ ఏకంగా 5 వేల రాకెట్లను ఇజ్రాయెల్‌లోని వివిధ నగరాలపై ప్రయోగించింది. రాకెట్ దాడుల మాటున అనేక మంది ఉగ్రవాదులు గాజా ప్రాంతం నుంచి ఇజ్రాయెల్‌లో చొచ్చుకొచ్చి పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కాగా, ఈ దాడులతో పాలస్తీనా భారీ తప్పిదానికి పాల్పడిందని ఇజ్రాయెల్ గర్జించింది. దాడులను తిప్పికొట్టేందుకు స్వార్డ్స్ ఆఫ్ ఐరన్ ఆపరేషన్ ప్రారంభించింది.