తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ పర్యాటక రంగం స్వర్ణ యుగంగా మారింది. రాష్ట్రంలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలున్నాయి. ఆదిమానవుడి కాలం నుంచి ఎన్నో చారిత్రక, పురావస్తు, సాంస్కృతిక, వారసత్వ ఆధారాలు ఉన్నాయని ఎక్సైజ్, పర్యాటక శాఖ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో పర్యాటక శాఖ , క్రీడా శాఖ, వారసత్వ శాఖలకు సంబంధించి పలు అభివృధి పనులకు వర్చువాల్‌గా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు తెలంగాణ ప్రాంతంలో ఉన్న పర్యాటక సాంస్కృతిక చారిత్రక వారసత్వ సంపదల పట్ల నిర్లక్ష్యం వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్ల రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు లభించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కృషి వల్ల వరల్డ్ బెస్ట్ టూరిజం విలేజ్‌గా భూదాన్ పోచంపల్లి గ్రామం ఎంపికైంది.
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఇరిగేషన్, వ్యవసాయ, పారిశ్రామిక, పర్యాటక, సంక్షేమం అభివృద్ధికీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. ఎంతో చారిత్రక వారసత్వ నేపథ్యం ఉన్న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నారాయణపేటకు సమీపంలో ఉన్న ముడుమాల్ కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపనకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన మన్యంకొండ పై రోప్ వే ను 50 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నాం. సీఎం కేసీఆర్ క్రీడలకు పెద్దపీట వేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సుమారు 17 గ్రామాలలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలను నిర్మించారని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు.