జీవితంలో ఆర్ధికపరమైన సమస్యలు .. మిగతా సమస్యల కంటే ఎక్కువగా బాధిస్తుంటాయి. అలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఉండాలంటే అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఆ తల్లికి ఇష్టమైనట్టుగా నడచుకోవలసి ఉంటుంది. పాలు .. పూలు .. పసుపు .. కుంకుమ .. దీపం .. గోవు .. ధనం .. ధాన్యం .. ఇవన్నీ లక్ష్మీదేవి నివాస స్థానాలుగా చెప్పబడుతున్నాయి. అందువలన వాటి విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. వాటి విషయంలో ఎప్పుడూ భక్తి శ్రద్ధలతో వ్యవహరించవలసి ఉంటుంది.అలాగే బాగా పొద్దుపోయేవరకూ నిద్రించేవారి ఇళ్లలోను .. సాయంత్రపు వేళలో నిద్రించే వారి ఇళ్లలోను లక్ష్మీదేవి ఉండదు. కష్టపడకుండా సోమరితనంతో కాలాన్ని వృథా చేసేవారి ఇళ్లను లక్ష్మీదేవి విడిచిపెట్టేస్తుంది. ఇక ఎప్పుడు చూసినా కలహాలతో వుండే ఇళ్లలోకి లక్ష్మీదేవి పొరపాటున కూడా కాలు పెట్టదట. ఎక్కడైతే పవిత్రత .. ప్రశాంతత ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందనే విషయాన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి.