తెలంగాణ వీణ , జాతీయం : అగ్నివీర్ సైనికుడు అమృత్‌పాల్ సింగ్ అంత్యక్రియలపై వివాదం రేగుతోంది. అగ్నివీర్ సైనికుని అంత్యక్రియల్లో సైనిక గౌరవం ఇవ్వలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆర్మీ స్పందించింది. అగ్నిపథ్ పథకానికి ముందు.. ఆ తర్వాత సైనిక లాంఛనాల్లో ఎలాంటి భేదం లేదని స్పష్టం చేసింది. ఆత్మహత్య వంటి స్వీయ అపరాధాలతో మరణిస్తే అంత్యక్రియల్లో సైనిక గౌరవం అందించే సాంప్రాదాయం లేదని వెల్లడించింది.
జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి సెక్టార్‌లో విధులు నిర్వహిస్తుండగా.. అగ్నిపథ్ సైనికుడు అమృత్‌పాల్ సింగ్ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఆర్మీ స్పష్టం చేసింది. అయితే.. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపకపోడంపై ఆర్మీపై విమర్శలు వెల్లువెత్తాయి. పంజాబ్‌లో రాజకీయ పార్టీలు సైన్యం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ అంశంపై చొరవ చూపాలని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను అభ్యర్థించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రాన్ని అధికార పార్టీ ఆప్ కూడా ప్రశ్నించింది.
దీంతో ఆదివారం రాత్రి ఆర్మీ ఓ ప్రకటన వెలువరించింది. అమృత్ పాల్ సింగ్ ఆకస్మిక మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. అంత్యక్రియల అంశంపై తప్పుడు ఆరోపణలు వస్తున్నాయని వెల్లడించింది. సింగ్ మృతదేహానికి పోస్టుమార్టం చేసిన తర్వాత ఆర్మీ విధానాల ప్రకారమే స్వస్థలానికి చేర్చామని తెలిపింది. 1967 ఆర్మీ ఆర్డర్ ప్రకారం ఆత్మహత్య వంటి మరణాలకు సైనిక లాంఛనాలు ఉండబోవని స్పష్టం చేసింది. అప్పటి నుంచి ఎలాంటి వివక్ష లేకుండా ఈ విధానాలను పాటిస్తున్నామని పేర్కొంది.