తెలంగాణ వీణ , మెదక్ : దుబ్బాక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం కేసులో సిద్ధిపేట పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. రాజకీయ కుట్ర కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే ఎంపీపై దాడి చేసిన నిందితుడు రాజు కుటుంబ సభ్యులను చేప్యాలలో పోలీసులు విచారించారు. నిందితుడు రాజు కాల్‌డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు రాజుకి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అతడు కోలుకున్న తర్వాత కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
నాలుగు రోజులు ఐసీయూలోనే.. కత్తిపోటుతో ప్రభాకర్‌రెడ్డి చిన్నపేగుకు గాయం కావడంతో సోమవారం యశోద ఆసుపత్రిలో వైద్యులు నాలుగు గంటలపాటు శ్రమించి ఆపరేషన్ చేశారు. చిన్న పేగును 10 సె.మీ మేర వైద్యులు తొలగించారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో చికిత్స అందిస్తుండగా మరో నాలుగు రోజులు ఐసీయూలోనే ఉండనున్నారు.
దుబ్బాకలో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రభాకర్‌రెడ్డి.. సోమవారం సిద్దిపేట జిల్లా సూరంపల్లిలో ప్రచారం నిర్వహించారు. తిరిగొస్తూ వాహనం వైపు వెళ్తుండగా ఓ వ్యక్తి కడుపులో కత్తితో పొడిచాడు. దీంతో ప్రభాకర్ రెడ్డిని మొదట గజ్వేల్‌కు, అక్కడి నుంచి హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. దగ్గరుండి ఎంపీని ఆస్పత్రికి తీసుకొచ్చారు మంత్రి హరీశ్‌రావు. శస్త్రచికిత్స చేసిన వైద్యులు.. గాయమైన చోట చిన్నపేగు భాగం తొలగించారు. సీఎం కేసీర్, మంత్రులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.