తెలంగాణ వీణ , హైదరాబాద్ : ఈ ఏడాది ఆఖరులో తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరం రాష్ర్టాల అసెంబ్లీల ఎన్నికలు జరుగనున్నాయి. అయితే వీటిలో ఒక్క మధ్యప్రదేశ్‌కు మాత్రమే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం అభ్యర్థిని ప్రకటించి పార్టీలో ‘సీఎం అభ్యర్థుల’ తేనెతుట్టెను కదిపారు. మాజీ సీఎం కమల్‌నాథ్‌ను సీఎం అభ్యర్థిగా రాహుల్ శనివారం భోపాల్ సభలో ప్రకటించారు. దీంతో ఇతర రాష్ర్టాల్లో కూడా పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తుందా? అనేది తాజాగా పార్టీలో, రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉన్నది. అలాంటిది ఒక్క మధ్యప్రదేశ్‌కు మాత్రమే సీఎం అభ్యర్థిని ప్రకటించడంతో ఎన్నికలు జరిగే ఇతర రాష్ర్టాలలో తేనెతుట్టేను కదిపినట్టు అయిందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. సీఎం అభ్యర్థిని ప్రకటించాలనే డిమాండ్ ఎన్నికలు జరుగనున్న ఇతర రాష్ర్టాల నుంచి కూడా వచ్చే అవకాశం లేకపోలేదని అభిప్రాయపడుతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడినట్టేనని విశ్లేషిస్తున్నారు.