తెలంగాణ వీణ , హైదరాబాద్ : జ్వరాలతో జనం అవస్థలు పడుతున్నారు. చిన్నాపెద్ద డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా లక్షణాలతో బాధపడుతున్నారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతోపాటు అనేక పల్లెల్లో జ్వరాల బారిన పడినవారు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. వైరల్ జ్వరాలతోపాటు ఎడతెగని దగ్గుతో ఇబ్బంది పడుతున్నారు. డెంగ్యూ భయం సామాన్య ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. గ్రామాల్లో ఖరీదైన వైద్యం చేయించుకోలేక పట్టణాలకు రాలేక గ్రామీణ వైద్యులను ఆశ్రయిస్తున్నారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జిల్లా కేంద్రంతోపాటు వేములవాడ, చందుర్తి, రుద్రంగి, బోయినపల్లి, వేములవాడ రూరల్, వేములవాడ అర్బన్, కోనరావుపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, తంగళ్లపల్లి, ఇల్లంతకుంట మండలాల్లోని అనేక గ్రామాల్లో ఇళ్లలో జ్వరాలతో బాధ పడుతున్నా వారు ఉన్నారు. మండల కేంద్రాల్లోని ప్రైవేటు ఆస్పత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. ప్లేట్‌లెట్స్ తగ్గిపోతుండడంతో వైద్యం కోసం హైదరాబాద్, కరీంనగర్‌లోని ఆస్పత్రులకు వెళ్తున్నారు. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థిక భారంతో సమతమవుతున్నాయి.